Abhishek Sharma: బ్యాట్ పట్టుకొని మైదానంలో దిగడమే ఆలస్యం. బౌలర్ ఎవరనేది చూడడు. ఎలా వేస్తున్నాడు అనేది పట్టించుకోడు. కొట్టామా? బంతి బౌండరీ వెళ్లిపోయిందా? ఇదే అతడి సిద్ధాంతం. సింగిల్స్ పెద్దగా ఇష్టపడడు. డబుల్స్ పై అంతగా ఆసక్తి చూపించడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. బీభత్సంగా పరుగులు తీస్తాడు. వేగం అనేది చివరి వరకు కొనసాగిస్తాడు. అందువల్లే ఈ నవ క్రికెట్లో సెహ్వాగ్ ను మరిపిస్తున్నాడు. అతడే అభిషేక్ శర్మ.
ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. ఏదో పూనకం వచ్చినట్టు.. బంతిమీద దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు.. బౌలర్లతో గెట్టు పంచాయితీ ఉన్నట్టు రెచ్చిపోయాడు. ముఖ్యంగా అఫ్రిది, రౌఫ్ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతి పడడమే ఆలస్యం క్రీజ్ వదిలి ఆఫ్ సైడ్ బ్యాట్ ఝళిపించడం.. మెరుపు వేగంతో బంతిని కొట్టడం.. బుల్లెట్ వేగంతో బౌండరీ కి పంపించడం.. లాఫ్టెడ్ షాట్ ఆకట్టుకోవడం.. వంటి విన్యాసాలను అభిషేక్ శర్మ మైదానంలో అభిమానులకు పరిచయం చేశాడు. ఒకరకంగా అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించాడు. తను కొట్టే ఫ్లిక్స్ షాట్ ల విషయంలో అభిషేక్ యువరాజ్ సింగ్ ను గుర్తుకు తెస్తుంటాడు. ఇన్ సైడ్ షాట్ ల విషయంలో ధోనిని మరిపిస్తాడు. యువరాజ్ సింగ్ శిక్షణలో అభిషేక్ రాటు తేలిపోయాడు. దానికంటే ముందు అభిషేక్ యువరాజ్ తండ్రి ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. అభిషేక్ శర్మ పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం అభిషేక్ శర్మ ఆసియా కప్ లో 208.43 స్ట్రైక్ రేట్ తో 173 పరుగులు చేశాడు. హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ తొలి స్థానంలో ఉన్నాడు. బ్యాట్ మాత్రమే కాదు బంతితో కూడా అద్భుతాలు చేస్తారు. తనకు మాత్రమే సాధ్యమైన స్పిన్ బౌలింగ్ వేసి అదరగొడతాడు. వాస్తవానికి ఏ ఆటగాడు అయినా సరే తొలి బంతిని వార్మప్ లాగా భావిస్తుంటాడు. కానీ అభిషేక్ అలా కాదు. బంతి ఎలా పడినా సరే బలంగా కొడతాడు. దృఢంగా ఆడతాడు. అందువల్లే అతడు మరో సెహ్వాగ్ లాగా టీం ఇండియాకు కనిపిస్తున్నాడు.. ఇక ఇప్పటివరకు 21 t20 మ్యాచ్ లు ఆడిన అభిషేక్.. 200 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు. ఏకంగా 708 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టుపై ఐదు మ్యాచ్లలో 279 పరుగులు చేశాడంటే ఇతడి బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.