https://oktelugu.com/

Indian Cricket: టీమిండియాకు.. ఎన్నాళ్ళు ఈ గాయాల బాధలు?

టీమిండియాలో విరాట్ కోహ్లీ మాత్రమే సొంతంగా కసరతులు చేస్తూ ఉంటాడు. అతడికి ఏకంగా ఫిట్నెస్ స్టూడియో ఉంటుంది. అతడు ఒక్కడు మాత్రమే గాయాల బారి నుంచి మినహాయింపు అన్నట్టుగా ఉన్నాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2024 / 10:10 AM IST

    Indian Cricket

    Follow us on

    Indian Cricket: ప్రపంచ కప్ కు ముందు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ ది అదే పరిస్థితి. దీంతో వారు నాలుగు నెలలపాటు ఆటకు దూరమయ్యారు. కీలక టోర్నీల్లో పాల్గొనకుండా జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందారు. ఆ తర్వాత వరల్డ్ కప్ లో ఆడారు.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత మళ్లీ పాత గాయాలు తిరగబెట్టాయి. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్ టోర్నీ కి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పట్లో వారు కోలుకునే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్నమైన బోర్డుగా బీసీసీఐకి పేరు ఉంది. ప్రపంచ క్రికెట్ నే శాసించే సత్తా ఆ బోర్డుకుంది. తలుచుకుంటే ఏమైనా చేయగలదు. కానీ జట్టుకు సంబంధించి గాయాలకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతోంది. బెంగళూరులో ఏర్పాటుచేసిన నేషనల్ క్రికెట్ అకాడమీలో సంవత్సరానికి కోట్లకు కోట్లు వార్షిక వేతనం ఇస్తూ వైద్యులను, ఫిజియోథెరపీ సిబ్బందిని నియమించుకుంటుంది. కానీ వారు జట్టు ఆటగాళ్లకు అయ్యే గాయాలను మాన్పలేక పోతున్నారు. దీనివల్ల కీలక టోర్నీల్లో ముఖ్యమైన ఆటగాళ్లు ఆడక పోవడం వల్ల ఆ ప్రభావం జట్టు విజయాలపై పడుతోంది. కోచ్ ల వైఫల్యమో, ఆటగాళ్ల తప్పిదమో తెలియడం లేదు గాని.. గాయాల బెడద మాత్రం తగ్గడం లేదు. ఒకరి వెంట ఒకరు గాయాల బారిన పడుతుండడం జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తున్నది.

    టీమిండియాలో విరాట్ కోహ్లీ మాత్రమే సొంతంగా కసరతులు చేస్తూ ఉంటాడు. అతడికి ఏకంగా ఫిట్నెస్ స్టూడియో ఉంటుంది. అతడు ఒక్కడు మాత్రమే గాయాల బారి నుంచి మినహాయింపు అన్నట్టుగా ఉన్నాడు. ఇక మిగతావారు గాయాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గాయాల బారిన పడటం.. జాతీయ క్రికెట్ అకాడమీలోకి వెళ్లి చికిత్స పొందడం.. తర్వాత ఆడుతుంటే ఆ పాత గాయాలు తిరగబెడుతూ ఉండడం.. ఇది సర్వసాధారణమైపోయింది. అప్పట్లో స్టార్ పేసర్ బుమ్రా గాయం కారణంగా చాలా రోజులపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రపంచ కప్ వరకు అతని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉంచారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రవీంద్ర జడేజా, దీపక్ చాహార్, హార్దిక్ పాండ్యా, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ షమీ, కే ఎల్ రాహుల్, ఇలా కీలక ఆటగాళ్లు మొత్తం గాయాల బారిన పడ్డారు. ఇంగ్లాండ్ జరిగిన తెలుగు టెస్టులో రాహుల్, జడేజా గాయపడ్డారు. దీంతో వారు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. రెండవ టెస్టులో అయ్యర్ గాయపడ్డాడు. అతడు కూడా అక్కడే చికిత్స పొందుతున్నాడు. అయితే మూడో టెస్టులో రాహుల్ వాడేది అనుమానంగానే ఉందని జట్టు సెలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చిన్నస్థాయి ఆటగాళ్లు గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పెద్ద స్థాయి ఆటగాళ్లు తరచూ గాయపడుతుండడం జట్టును ఇబ్బందికి గురిచేస్తోంది. జడేజా పేరు జట్టులో ఉన్నప్పటికీ మూడో టెస్ట్ ఆడేది అనుమానంగానే ఉందని తెలుస్తోంది.

    జట్టు ఆటగాళ్ళను ఈ స్థాయిలో గాయాలు ఇబ్బంది పెడుతుంటే ఇంజురీ మేనేజ్మెంట్ ఏం చేస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది. గత మూడేళ్లలో రవీంద్ర జడేజా, రాహుల్ 12సార్లు గాయపడ్డారని అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఈ ఉదాహరణ చాలు మన ఇంజురీ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో పనిచేస్తుందో చెప్పేందుకు.. వాస్తవానికి గాయాల బారిన పడ్డ ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ అకాడమీ లో చేరుతారు. అక్కడ చికిత్స పొందిన తర్వాత..ఫిట్ నెస్ సాధించిన తర్వాత క్లియరెన్స్ ఇస్తారు. కానీ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్లీ గాయపడుతున్నారు. మళ్లీ క్రికెట్ అకాడమీలో చేరుతున్నారు.. చాలా కాలం పాటు ఆటకు దూరమవుతూనే ఉన్నారు. ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా జరుగుతున్నది. ప్రపంచంలో ఏ జట్టుకు లేని గాయాల బెడద భారత జట్టును మాత్రమే వేధిస్తోంది అంటే టీం ఇంజురీ మేనేజ్మెంట్ సరిగా పనిచేయడం లేదనే కదా అర్థం.