India Vs USA: ఐసీసీ రూల్ తెలియక కొంప ముంచుకున్న అమెరికా.. ఇదే భారత్ గెలుపునకు టర్నింగ్ పాయింట్

మ్యాచ్ లను సకాలంలో ముగించేందుకు ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన నిమిషంలోపు తదుపరి ఓవర్ మొదలుపెట్టాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 8:24 am

India Vs USA

Follow us on

India Vs USA: టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్న అమెరికా.. భారత్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో హోరాహోరీ గా ఆడింది. అనామక జట్టే అయినప్పటికీ పూర్తిస్థాయి ఓవర్లు ఆడింది. బుమ్రా వంటి బౌలర్ ను ధాటిగా ఎదుర్కొంది. న్యూయార్క్ లాంటి మైదానంపై మూడు అంకెల స్కోర్ సాధించి సత్తా చాటింది. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంది. చివరికి ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో ఐసీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధన తెలియక అమెరికా తన కొంప తానే ముంచుకుంది. స్టాప్ క్లాక్ రూల్ తెలియక.. ఐదు పరుగులను అప్పనంగా టీమిండియాకు ఇచ్చింది.

ఏంటి ఈ రూల్

మ్యాచ్ లను సకాలంలో ముగించేందుకు ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన నిమిషంలోపు తదుపరి ఓవర్ మొదలుపెట్టాలి. ఒక ఇన్నింగ్స్ లో ఇలా మూడుసార్లు నిమిషంలోపు మిగతా ఓవర్ మొదలు పెట్టకపోతే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ సమయాన్ని థర్డ్ ఎంపైర్ స్టాప్ క్లాక్ సహాయంతో లెక్కిస్తాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అమెరికా బౌలర్లు మూడుసార్లు నిమిషం లోపు మరో
ఓవర్ మొదలు పెట్టలేదు. అప్పటికి ఎంపైర్ రెండుసార్లు హెచ్చరించారు. మూడోసారి కూడా ఇదే సంఘటన పునరావృతం కావడంతో అదనంగా ఐదు పరుగులు పెనాల్టీ విధించాల్సి వచ్చింది. ఈ ఐదు పరుగులు టీమ్ ఇండియా పై ఒత్తిడిని చాలా వరకు తగ్గించాయి.

భారత జట్టు విజయ సమీకరణం 30 బంతుల్లో 35 పరుగులకు చేరుకున్నప్పుడు.. ఈ ఐదు పరుగులు లభించడం రోహిత్ సేనకు ఊరటనిచ్చింది. ఈ ఐదు పరుగులు రావడంతో భారత ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.. ఇక ఇదే సమయంలో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను సౌరభ్ నేత్రావల్కర్ అందుకోలేకపోయాడు. ఒకవేళ అతడు గనుక ఈ క్యాచ్ పట్టి ఉంటే ఆట తీరు మరో విధంగా ఉండేది. పెనాల్టీ అయిదు పరుగులు లభించకపోయినా ఫలితం మరోలా ఉండేది.

ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 24) టాప్ స్కోరర్ లుగా నిలిచారు. భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా (2/14) రెండు వికెట్లు, అక్షర్ పటేల్ (1/25) కు ఒక వికెట్ దక్కింది.. లక్ష్య చేదనలో భారత జట్టు వెంట వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రిషబ్ పంత్ వికెట్ నష్టపోయింది. అయితే సూర్య కుమార్ అజేయ అర్థ సెంచరీ, శివం దూబే 31 పరుగులతో రాణించాడు. సౌరభ్ నేత్రావల్కర్ 2/18, అలీ ఖాన్ 1/21 తో ఆకట్టుకున్నారు. గెలుపు ద్వారా టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్ -8 కు చేరుకుంది.