India Vs USA: న్యూయార్క్ లో టీమిండియా తీన్మార్.. సూపర్ -8 కు రోహిత్ సేన

అమెరికా విధించింది 111 పరుగుల స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ.. ప్రారంభంలోనే టీమ్ ఇండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సౌరభ్ వేసిన తొలి ఓవర్ లో విరాట్ కోహ్లీ 0 పరుగులకే అవుట్ అయ్యాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 8:06 am

India Vs USA

Follow us on

India Vs USA: టి20 ప్రపంచ కప్ లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది.. హ్యాట్రిక్ గెలుపులతో సూపర్ -8 కు దూసుకెళ్లింది. అమెరికా జట్టుతో న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. సూర్య కుమార్ యాదవ్ (49 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 50*) అజేయ అర్థ సెంచరీ సాధించాడు. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

టాస్ నెగ్గిన టీమిండియా.. ముందుగా అమెరికా బ్యాటింగ్

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా అమెరికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇందులో భాగంగా అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్ (23 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ తో 27), స్టీవెన్ టేలర్ (30 బంతుల్లో రెండు సిక్స్ లతో 24) అదరగొట్టారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ (4/9) నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా (2/14) రెండు వికెట్లు పడగొట్టాడు.. అక్షర్ పటేల్ (1/25) ఒక వికెట్ దక్కింది.

మూడు వికెట్ల నష్టంతో..

ఈ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ అర్ధ సెంచరీ, శివం దూబే(31*; 35 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ (2/18) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్ (1/21) ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపు ద్వారా టీమిండియా సూపర్ -8 కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ ను సౌరభ్ అందుకోలేకపోయాడు.. ఇదే సమయంలో పెనాల్టీ రూపంలో అమెరికా ఐదు పరుగులు సమర్పించుకోవడం కూడా ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.

దెబ్బతీసిన సౌరభ్

అమెరికా విధించింది 111 పరుగుల స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ.. ప్రారంభంలోనే టీమ్ ఇండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సౌరభ్ వేసిన తొలి ఓవర్ లో విరాట్ కోహ్లీ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని అనవసరంగా వెంటాడి కీపర్ కు దొరికిపోయాడు. మరుసటి ఓవర్ లో కెప్టెన్ రోహిత్ కూడా (3) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 10 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్ (18), సూర్య కుమార్ యాదవ్ టీమిండియాను ఆదుకున్నారు. ఫలితంగా పవర్ ప్లే లో రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. నిదానంగా ఆడుతున్న పంత్ (18) ను అలీ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో శివం దూబే క్రీజ్ లోకి వచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ సమయోచితంగా ఆడాడు.

సమయోచితంగా..

ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ ను సౌరభ్ అందుకోలేకపోయాడు. ఈ జీవదానాన్ని సద్వినియోగం చేసుకున్న సూర్య కుమార్ యాదవ్… దూబే తో కలిసి సమయోచితంగా ఆడటం మొదలుపెట్టాడు.. కోరే అండర్సన్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి తన లయలోకి వచ్చిన శివం.. ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.. అయితే 15 ఓవర్ తర్వాత టీమిండియా కు 5 పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చాయి. ఓవర్ పూర్తయిన తర్వాత అమెరికా బౌలర్లు 60 సెకండ్లలోపు మరో ఓవర్ ప్రారంభించలేదు.. ఇలా మూడుసార్లు ఆ సంఘటన జరగడంతో నిబంధనల ప్రకారం అమెరికాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో టీం ఇండియాకు ఆయాచితంగా ఐదు పరుగులు వచ్చాయి. ఈ ఐదు పరుగుల ద్వారా టీమిండియా ఆటగాళ్లు కాస్త ఉపశమనం పొందారు. ఇదే దశలో వన్ స్కాల్విక్ వేసిన 16 ఓవర్లో సూర్య ఒక సిక్స్ కొట్టాడు, బౌండరీ బాదాడు. ఫలితంగా టీం ఇండియా పై కాస్త ఒత్తిడి తగ్గించాడు. అలీ ఖాన్ వేసిన 19 ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. ఇక శివం దూబే క్విక్ డబుల్ తో భారత జట్టుకు గెలుపును అందించాడు.