India vs Sri Lanka: నిరుడు ఆసియా కప్ టి20 ఫార్మట్ లో జరిగింది. బలమైన భారత జట్టు ప్రస్థానం మధ్యలో ముగిసింది. కనీసం సూపర్ _4 దశను కూడా దాటలేకపోయింది. ఫైనల్ లో పాక్ జట్టుతో తలపడిన శ్రీలంక టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ ఏడాది ఆసియా కప్ ఐసిసి టి 20 ఫార్మాట్ లో కాకుండా వన్డే ఫార్మాట్ లో నిర్వహిస్తోంది. అయితే ఈసారి కూడా లంకేయులు ఫైనల్ చేరారు. అంతేకాదు వరుసగా రెండవసారి టైటిల్ దక్కించుకునే స్థాయిలో ప్రదర్శన ఇచ్చారు. ఇక టైటిల్స్ విషయంలో శ్రీలంకకు భారత్ కు మధ్య ఒక్కటి మాత్రమే తేడా. ఏ లెక్కన చూసుకున్నా భారతదేశానికి గతిపోటీ తప్పదు అని అందరూ అంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమైన తర్వాత శ్రీలంక పెట్టుకున్న అంచనాలు మొత్తం తలకిందులయ్యాయి. క్రికెట్ నిపుణులు చెప్పిన జోస్యం మొత్తం తప్పయింది. సిరాజ్ ధాటికి శ్రీలంక బెంబేలెత్తిపోయింది.. 50 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఇందులో ఐదుగురు బ్యాట్స్మెన్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు.
టాస్ గెలిచిన లంక కెప్టెన్ శనక మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానం మీద తేమ ఉంది కాబట్టి, ఆడుతోంది సొంతమైదానం కాబట్టి భారీగా పరుగులు సాధించవచ్చు అని శనక అనుకుని ఉంటాడు..కానీ తన నిర్ణయం ఎంత తప్పో ఆ తర్వాత గాని అతడికి అర్థమయి ఉండదు. తొలి ఓవర్ వేసిన బుమ్రా 0.3 వద్ద కుషాల్ ఫెరీరా ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్ సైడ్ స్వింగర్ ను తప్పుగా అర్థం చేసుకున్న ఫెరీరా.. బ్యాట్ ను ఝళిపించబోయాడు. అది అంచుకు తాకి కీపర్ రాహుల్ చేతిలో పడింది. దీంతో శ్రీలంక 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సిరాజ్ అందుకున్నాడు.
మైదానం అసలే తేమగా ఉండటంతో నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశాడు. అతడి బంతుల ధాటికి లంక ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. కనీసం బ్యాట్ ను ఊపేందుకు కూడా ధైర్యం చేయలేకపోయారు. తను వేసిన రెండవ ఓవర్ తొలి బంతికి సిరాజ్.. అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ నిషాంక ను ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని షాట్ ఆడబోయి రవీంద్ర జడేజాకు చిక్కాడు. ఎప్పుడైతే ఈ వికెట్ పడగొట్టాడో.. అప్పటినుంచి సిరాజ్ మాయాజాలం మొదలైంది. ఆ తర్వాత వేసిన మూడవ బంతికి సధీర సమర విక్రమను సిరాజ్ ఔట్ చేశాడు. లో హైట్ లో వచ్చిన బత్తిని తప్పుగా అర్థం చేసుకున్న సమర విక్రమ.. వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి శ్రీలంక స్కోరు 3.3 ఓవర్లకు 8 పరుగులు. ఆ తర్వాత బంతికే చరిత అసలంకనూ సిరాజ్ బలిగొన్నాడు. సిరాజన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి ఇషాన్ కిషన్ కు దొరికిపోయాడు. ఇలా ఒక ఓవర్లో సిరాజ్ మూడు కీలకమైన వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. అదే ఓవర్ చివరి బంతికి ధనుంజయ డిసిల్వా ను ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతి ధనుంజయ బ్యాట్ చివరి అంచును తాకి కీపర్ రాహుల్ చేతిలో పడింది.
ఆ మరుసటి ఓవర్ వేసిన బుమ్రా మేడిన్ తో ముగించాడు. బంతి అందుకున్న సిరాజ్ మరింత పదునైన బంతులు వేశాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ దాసున్ శనక ను ఔట్ చేశాడు. తక్కువ ఎత్తులో బంతివేసి అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 11.2 ఓవర్ వద్ద కుషాల్ మెండీస్(17) ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా సిరాజ్ దెబ్బకు శ్రీలంక సగం బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరుకున్నారు. ఔట్ అయిన వారిలో ఐదుగురు బ్యాట్స్ మెన్ ఖాతా తెరవకపోవడం విశేషం. శ్రీలంక ఆటగాళ్లలో ఒక్క కుషాల్ మెండీస్ చేసిన 17 పరుగులే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
సిరాజ్ హవా కొనసాగిన ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా సత్తా చాటాడు. తను కూడా కీలకమైన మూడు వికెట్లు తీశాడు. వెల్లాలగే, ప్రమోద్ మధు షాన్, పాతీర్నా వికెట్లను హార్దిక్ తీశాడు. సమర విక్రమ, అసలంక, శనక, పాతీర్నా , ఫెరేరా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నారు. మొత్తానికి ఆసియా కప్ లో అత్యంత స్వల్ప స్కోరుకు శ్రీలంక జట్టు ఆల్ అవుట్ కావడానికి ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత మైదానంలో ఇంత తక్కువ స్కోరు చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా జట్టు ఆటగాళ్ళను వారు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది టైటిల్ గెలిచి.. ఏడాది అత్యంత అనామకంగా ప్రదర్శన చేయడమేంటని వారు ప్రశ్నలు సంధిస్తున్నారు.