India Vs Sri Lanka Asia Cup Final 2023: ఢీ అంటే ఢీ అనే స్థాయిలో జరగాల్సిన మ్యాచ్ ఏకపక్షం అయిపోయింది. ఆదివారం నాడు అభిమానులను సీటు చివరి అంచులో కూర్చొని చూడాల్సిన మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా జరిగింది ఒక్కడి వల్ల.. సొంత దేశంలో శ్రీలంక టాప్ ఆర్డర్ పేక మేడ అయింది ఒక్కడి వల్ల.. సొంత మైదానంలో పసి కూన మాదిరి శ్రీలంక శోకాలు పెట్టింది ఒక్కడి వల్ల. అతడే మహమ్మద్ సిరాజ్.. ఈ 29 సంవత్సరాల హైదరాబాద్ కుడిచేతి వాటం బౌలర్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ను భారత్ వైపు మొగ్గేలా చేశాడు. ఏకపక్షంగా సాధించేలా చేశాడు. ఆసియా కప్ లో టైటిళ్ళ వేటలో(7) ముందున్న భారత జట్టు కలికి తురాయిలో మరో కప్ చేరేలా చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు టాప్ ఆర్డర్ ను పేక మేడలాగా కూల్చి వేశాడు సిరాజ్. ముఖ్యంగా మూడో ఓవర్లో 4 వికెట్లు తీసి శ్రీలంక వెన్ను విరిచాడు. శ్రీలంక సంబంధించిన ముగ్గురు బ్యాటర్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు అంటే అర్థం చేసుకోవచ్చు. మైదానం మీద ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న సిరాజ్ నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశాడు. 140 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బంతులు వేయడంతో లంక బ్యాటర్లు వణికి పోయారు. బంతిని కనీసం బ్యాట్ తో ముట్టు కోవడానికి కూడా భయపడిపోయారు. ఫోర్లు కాదు కదా కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా ఇబ్బంది పడిపోయారు. మ్యాచ్ చూస్తుంటే ఆడుతోంది శ్రీలంకా లేదా నేపాల్ జట్టా అనిపించేలాగా ఆడారు. మైదానం మీద తేమ బాగా ఉండడంతో బంతి బాగా స్వింగ్ అవుతున్నది. అయితే టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆకస్మాత్తుగా ఆయన బ్యాటింగ్ నిర్ణయం తీసుకోవడం శ్రీలంక జట్టు పాలిట శాపంగా మారింది.
నిప్పులు చెరిగే విధంగా బం బంతులు వేసిన సిరాజ్ తన కెరియర్లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. 21 పరుగులకు ఆరు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. ఇక సిరాజ్ కు బుమ్రా, హార్దిక్ తోడు కావడంతో శ్రీలంక ఏ దశలోనూ కోలులేకపోయింది. ఏ ఒక్క బ్యాట్స్ మెన్ సిరాజ్ ను అడ్డుకోలేకపోయారు. కనీసం ప్రతిఘటించలేకపోయారు. ఓ కెన్యా, నేపాల్ జట్ల బ్యాట్స్ మెన్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అసలు గత ఏడాది ఆసియా కప్పు కొట్టుకెళ్లిన టీం ఇదేనా అనే అనుమానం కలిగేలాగా ఆడారు. కాగా సొంత దేశంలో లంక ఆటగాళ్లు ఆడిన తీరుపట్ల అక్కడి అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మైదానంలోనే లంక ఆటగాళ్లకు వ్యతిరేకంగా ప్రకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుతం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.