India Vs South Africa Final: టి20 వరల్డ్ కప్ చివరి దశకు చేరింది.. శనివారం బార్బడోస్ వేదికగా టీమిండియా – దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు ఇంతవరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోలేదు. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా బలమైన జట్లను ఓడించుకుంటూ ఫైనల్ లోకి ప్రవేశించాయి. టీమిండియా 2007లో టి20 వరల్డ్ కప్ సాధించింది. 2014లో ఫైనల్ దాకా వెళ్లి.. శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఇంతవరకు టి20 వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళలేదు. అయితే ఈ రెండు జట్లు కూడా కప్ దక్కించుకోనేందుకు చివరి వరకు పోరాడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. మరోవైపు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఇదే చివరి t20 వరల్డ్ కప్. ఈ కప్ తర్వాత అతడు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటాడు.
2007లో వెస్టిండీస్ వేదిక వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు.. టీమిండియా కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ఆ సీజన్ లో భారత్ గ్రూప్ దశలోనే ఇంటికి వచ్చింది. హేమాహేమిల లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీమిండియా గ్రూప్ దశ నుంచే వెనక్కి తిరిగి రావడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇవ్వడం నేపథ్యంలో కెప్టెన్సీ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు. నాటి అవమానానికి బదులు తీర్చుకోవాలని రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నాడు.
అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే బార్బడోస్ మైదానాన్ని రాహుల్ ద్రావిడ్ శనివారం పరిశీలించాడు. అక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. మైదానం పరిస్థితిని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.” మా జట్టు లాగే దక్షిణాఫ్రికా కూడా వరుస విజయాలతో ఫైనల్ వచ్చింది. మేము ప్రత్యర్థులను ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదు. వారు మెరుగైన క్రికెట్ ఆడతారని ఆశిస్తున్నాం. కాకపోతే మేం కూడా అంతకుమించి అనేలాగా నాణ్యమైన క్రికెట్ ఆడతాం. ఈ మైదానంపై మాకు ఆడిన అనుభవం ఉంది. సూపర్ -8 పోరులో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడ్డాం. అయితే ఈసారి మైదానం ఎలా అయినా టర్న్ తిరుగుతుంది. ఇక్కడి పరిస్థితులపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు కప్ గెలుచుకోవాలని లక్ష్యంతోనే ఉన్నాడని” రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.
” గత కొన్ని సంవత్సరాలుగా మేము నిలకడైన ఆట తీరు కొనసాగిస్తున్నాం. అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతున్నాం. ఏడాది కాలంలో ఐసీసీ నిర్వహించిన మూడు మేజర్ టోర్నీలలో ఫైనల్ దాకా వచ్చాం. అయితే ఈసారి టి20 వరల్డ్ కప్ గెలుచుకుంటామని నమ్మకం మాలో ఉంది. ఫైనల్ మ్యాచ్ అనగానే ఆటగాళ్లలో ఒత్తిడి ఉంటుంది. అయితే దానిని మేము అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆటగాళ్లపై ఎక్కువగా ఒత్తిడి పెంచకూడదనే ఉద్దేశంతోనే తక్కువ ప్రాక్టీస్ చేశాం. వ్యూహాత్మకంగా, మానసికంగా, శారీరకంగా రకంగా సిద్ధమయ్యేందుకు ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో తర్ఫీదునిచ్చామని” ద్రావిడ్ స్పష్టం చేశాడు. మరోవైపు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు ఇదే తన చివరి మెగా టోర్నీ. జూలై నెల నుంచి టీమిండియా కొత్త కోచ్ ఆధ్వర్యంలో ఆడుతుంది.