Polavaram Project: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి వారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్షిస్తానని ప్రకటించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు గత ఐదేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని.. అందుకు జగన్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఏకంగా శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్షం మధ్య గట్టి విమర్శలే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం మీ పాపమే అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో అసలు డయాఫ్రం వాల్ అంటే ఏంటి? కాఫర్ డ్యాం అంటే ఏంటి అన్న చర్చ అయితే ఏపీలో బలంగా సాగుతోంది. ఒకసారి ఆ కాఫర్ డ్యామ్ గురించి తెలుసుకుందాం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా.. గోదావరి గర్భంలో ఇసుక పొరల్లో నిర్మించింది డయాఫ్రమ్ వాల్. ఆ గోడను ఏక మొత్తంగా నిర్మించుకు రావడం అసాధ్యం. అందుకే యంత్రాల సాయంతో తొలుత ఏడు మీటర్ల మేర తవ్వుతూ.. బెంటి నైట్ ద్రావణం నింపుతూ వెళ్లారు. తవ్విన ప్రదేశంలోని ఇసుక, మట్టి, రాళ్లను అదే యంత్రం సాయంతో బయటకు తీసుకొచ్చేశారు. తిరిగి ప్లాస్టిక్ కాంక్రీట్ ను ఆ ప్రదేశంలో నింపారు. ఇలా ఏడేసి మీటర్లు చొప్పున నిర్మించడమే ఒక ప్యానెల్. దాని పక్కన మళ్లీ 2.8 మీటర్లు వదిలేసి.. మళ్లీ మరో ఏడు మీటర్ల మేర తవ్వుకుంటూ గోడ నిర్మించారు. తరువాత మధ్య మధ్యలో 2.8 మీటర్ల మీద వదిలేసిన వాటిలో తవ్వి అక్కడ గోడ కట్టారు. ఇదే డయా ఫ్రమ్ వాల్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన విభాగం.
సాధారణంగా గోదావరి నదిలో లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే నెల.. ఆఖరి వరకు ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. అందుకే ఆ సమయంలో పనులకు పెద్దపీట వేశారు. దాదాపు 412 రోజుల్లో డయా ఫ్రం వాల్ ను నిర్మించారు. దాదాపు 430 కోట్లు ఖర్చు చేశారు.కానీ 2020 వరదల్లో ఈ నిర్మాణం కొట్టుకెళ్లిపోయింది. అయితే ఈ పాపం మీదంటే మీది అని అధికార వైసిపి, విపక్ష టీడీపీ అప్పట్లో ఆరోపించుకున్నాయి.
సాధారణంగా డ్యాముల నిర్మాణ సమయంలో రెండు కాపర్ డ్యాంలను నిర్మిస్తారు. డ్యామ్ కట్టే ప్రదేశానికి ఎగువన ఒకటి.. దిగువన మరో కాపర్ డ్యాం నిర్మిస్తారు. అంతకంటే ముందే ఎగువ కాపర్ డ్యాం పై భాగంలో నదీ ప్రవాహాన్ని మళ్లిస్తారు. తద్వారా డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం వరదలకు ప్రభావితం కాకుండా జాగ్రత్తపడతారు. కాపర్ డ్యామ్లను మట్టి, రాక్ ఫిల్ తో నిర్మిస్తారు. గట్టిదనం కోసం కాంక్రీట్ ని కూడా వాడుతారు. డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దిగువ కాపర్ డ్యాం తొలగిస్తారు. డైవర్షన్ తొలగించి ఎగువ కాపర్ డ్యాం ను అలాగే విడిచిపెడతారు. అయితే ఈ కాపర్ డ్యాం ఉన్న పోలవరంలో.. డయాఫ్రం వాల్ వరదల్లో కొట్టుకుపోవడం విశేషం. అప్పట్లో టిడిపి ప్రభుత్వం నాణ్యత పాటించకపోవడంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పనులను అర్ధాంతరంగా నిలిపి వేయడమే కారణమని తాజాగా టిడిపి ఆరోపణలు ప్రారంభించింది. దీంతో ఇది ఒక వివాదాస్పద అంశంగా మారిపోయింది.
2022లో పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం ను నిర్మించారు. జూలైలో వచ్చిన వరదలను ఎదుర్కునేందుకు రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచారు. రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన కాపర్ డ్యాంను రెండు మీటర్ల వెడల్పు, మీటరు ఎత్తు పెంచే పనులను రెండు రోజుల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించారు. వాస్తవానికి 28 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం వచ్చినా తట్టుకునేలా కాపర్ డ్యాం ను నిర్మించారు. దీనికి మించి వరద వస్తే డ్యాం పై నీరు ప్రవహించే ప్రమాదం ఉంది. అందుకే కాపర్ డ్యాం ఎత్తును అప్పట్లో పెంచారు. 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేశారు అప్పట్లో. కాపర్ డ్యాం ఎత్తు 43 మీటర్లు ఉండగా.. మరో మీటర్ పెంచడంతో అది 44 మీటర్లకు చేరింది.