Ind Vs Pak Women T20: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. చుక్కలు చూసిన పాకిస్తాన్.. హర్మన్ ప్రీత్ సేన టార్గెట్ ఎంతంటే?

న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. టీ -20 వరల్డ్ కప్ లో హర్మన్ ప్రీత్ సేన గ్రూప్ - ఏ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది..-2.900 రన్ రేట్ తో సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఈ దశలో పాకిస్తాన్ జట్టుతో ఆదివారం జరిగే మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 6, 2024 6:16 pm

Ind Vs Pak Women T20

Follow us on

Ind Vs Pak Women T20: ఇలాంటి నేపథ్యంలో భారత జట్టు సరికొత్తగా ప్రదర్శన చేసింది. మందకొడి మైదానం పై మంటలు మండించింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్ – భారత్ పోరు జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మరో మాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇది తప్పుడు నిర్ణయమని భారత బౌలర్లు ప్రారంభంలోనే నిరూపించారు. శ్రేయాంక పాటిల్ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి పాకిస్తాన్ ఓపెనర్ గుల్ ఫిరోజా(0) రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. పాకిస్తాన్ జట్టు ఒక పరుగు వద్దే ఓపెనర్ వికెట్ కోల్పోవడంతో కాస్త తడబడింది. ఇక అప్పుడు మొదలైన భారత బౌలర్ల ప్రతాపం.. మ్యాచ్ చివరి వరకు కొనసాగింది. ముఖ్యంగా అరుంధతి రెడ్డి (3/19) మూడు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్(2/12) రెండు వికెట్లు సాధించింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టులో నిదా ధార్(28) టాప్ స్కోరర్ గా నిలిచింది. నిదా తర్వాత, ఓపెనర్ మునిబా అలీ (17) సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచింది. ఫాతిమాసనా(13) పరుగులు చేసి థర్డ్ టాప్ స్కోరర్ గా ఆవిర్భవించింది. వీరు ముగ్గురు తప్ప మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది..

మందకొడి మైదానంపై..

దుబాయ్ మైదానం మందకొడిగా ఉంటుంది. పేస్ బౌలర్లకు సహకరిస్తుంది. స్పిన్నర్లకు అప్పుడప్పుడు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మైదానంపై భారత స్పిన్, పేస్ బౌలర్లు బంతిపై సింగ్, బౌన్స్ ను రాబట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. వాస్తవానికి టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా బ్యాటింగ్ ఎంచుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా ఆటగాళ్లు అంతర్గతంగా సంబరపడ్డారు. ఎందుకంటే ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇబ్బంది ఎదురవుతుంది. ఆడగా ఆడగా మైదానం బ్యాటర్లకు సహకరిస్తుంది. అందువల్లే పాకిస్తాన్ ఆటగాళ్లు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డారు. మరోవైపు తొలి మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య ఈ మ్యాచ్ ఆడింది. ఎలాగైనా గెలవాలనే కసితో భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. ఫీల్డర్లు కూడా చురుగ్గా కదిలారు.. అందువల్ల పాకిస్తాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత్ ఎదుట 106 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ ను చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన భారత జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 3.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 16 పరులు చేసింది.. స్మృతి మందాన (6), షఫాలి వర్మ (6) క్రిజ్ లో ఉన్నారు..