Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆంజనేయ స్వామికు ఎంత భక్తుడో తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని తెలుపుతుంటారు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసుతో ఆంజనేయ స్వామి మీద తన భక్తి చాటుకున్నారు. ఇప్పటికే ఆయన పలు ఆలయాలకు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మనకు తెలిసినవే కేవలం కొన్ని మాత్రమే, తెలియనివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి తన భక్తిని చాటుకుంటూ కొండగట్టు ఆంజనేయ స్వామికి భారీ విరాళమిచ్చారు. అయితే డబ్బు రూపంలో కాకుండా బిల్డింగ్ రూపంలో సాయాన్ని అందించనున్నారు. భక్తుల సౌకర్యార్థం కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి 100 గదుల బిల్డింగ్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దానికి కావాల్సిన స్థలాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ అధికారులు పరిశీలించారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభంకానున్నాయి.
భక్తులకు సౌకర్యంగా ఉండే చోటే కనుగొనడం కోసం వీరు పరిశీలించనున్నారు. ట్రాన్స్ పోర్ట్ కు దగ్గరగా ఉంటే చోటును వెతకనున్నారు. ఎపీ ఎన్నికలకు ముందు పవన్ కొండగట్టును పలుసార్లు సందర్శించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కల్యాణ్ కొండగట్టు వెళ్లారు. ఎన్నికలలో గెలిచి ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఈ ఆలయాన్ని సందర్శించాడు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయరీతిలో స్వాగతం పలికాయి. అనంతరం, పవన్ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టుకు పవన్ వెళ్లినప్పుడు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు పవన్ సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్నారు. తాజాగా తిరుమల లడ్డు వివాదంలో సనాతన ధర్మంను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సెన్సేషన్ సృష్టించాయి. ఇతర మతాలను చూసి హిందువులు నేర్చుకోవలసినవి చాలానే ఉన్నాయని మొన్న తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అభిమానులను ఆలోచింపచేసింది.
సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం గౌరవం ఇవ్వడంలేదని.. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చా. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఇక్కడికి రాలేదు. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చానన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మమని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేశారని ధ్వజమెత్తారు. తిరుమలకు వెళ్తే తన కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించానన్నారు. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని స్పష్టం చేశారు. దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయన్నారు. రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశం అంటారన్నారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా? లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారన్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు? సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.