India Vs England:”అనువు గాని చోట అధికులమనరాదు” .. ఇది ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben stokes)కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతడి తోటి క్రీడాకారుకూ వర్తిస్తుంది. “దూకుడు పనికిరాదు. ఒక్క టెస్టులో గెలిచిన తర్వాత భారత మైదానాలపై గెలుపు నల్లేరు మీద నడక కాదు” అని చెప్పినప్పటికీ ఇంగ్లాండ్ టీం వినిపించుకోలేదు. “చెరపకురా చెడేవు” అంటే అర్థం చేసుకోలేదు. ఫలితంగా హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. 3-1 తేడాతో సిరీస్ చేజారింది. “బజ్ బాల్” అంటూ స్వదేశం తో పాటు విదేశాల్లోనూ ఇంగ్లీష్ టీం సందడి చేసింది. రెండు సంవత్సరాలుగా పట్టింది మొత్తం బంగారమే అన్నట్టుగా స్టోక్స్ సేన విర్రవీగింది. కానీ రోహిత్ శర్మ(Rohit Sharma) సారధ్యంలోని యువకులు స్టోక్స్ కు గర్వ భంగం కలిగించారు. ఆకాశంలో ఉన్న వారిని ఒక్కసారిగా నేలకు తీసుకొచ్చారు. దిగ్గజమైన ఆటగాళ్లు ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు.. మీ ఆటలు ఇక్కడ సాగవని గట్టి సందేశం పంపారు. ఓటమి అనేది లేకుండా దూసుకుపోతున్న బ్రెండన్ మెక్ కల్లమ్(Brendon McCullum), బెన్ స్టోక్స్ (Ben stokes) ద్వయానికి, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు(England Wales cricket board) ఆత్మ పరిశీలన చేసుకోవాలని సంకేతాలు ఇచ్చారు. టెస్టుల్లో దూకుడు కాదు.. నిలకడ ముఖ్యమని.. ఆడితేనే ఫలితాలు వస్తాయని కుర్రాళ్ళు తమ ఆటతీరుతో నిరూపించారు.
మెక్ కల్లమ్.. ఇంగ్లాండ్ జట్టుకు 2022 లో కోచ్ గా నియమితులైన తర్వాత.. ఆ జట్టు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ దేశాలపై టెస్ట్ సిరీస్ లు ఓడిపోయింది.. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ అప్పటి సారధి జో రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. మెక్ కల్లమ్ – బెన్ స్టోక్స్ ద్వయానికి స్వదేశంలోనే న్యూజిలాండ్ తో పరీక్ష ఎదురయింది.. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. అప్పటి నుంచి మొదలైన బజ్ బాల్ ఆట రాంచి దాకా కొనసాగింది.
ఇంగ్లాండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసిన తర్వాత మెక్ కల్లమ్ – బెన్ స్టోక్స్ ద్వయం పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎడ్జ్ బాస్టన్ వేదికపై భారత్ తో జరిగిన రీ షెడ్యూల్ టెస్ట్ లో టీమిండియా 375 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఇంగ్లాండ్ దాన్ని అత్యంత సులువుగా ఛేదించింది. ఇదే ఊపులో స్వదేశంలో సౌత్ ఆఫ్రికా పై సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. సుదీర్ఘకాలం తర్వాత 2022 డిసెంబర్ లో పాక్ లో ఇంగ్లాండ్ పర్యటించింది.. అక్కడ సంచలన విజయాలు నమోదు చేసింది. రావల్పిండి టెస్టులో ఒకే రోజు 500 పరుగులు నమోదు చేసి బెన్ స్టోక్స్ సేన సంచలనం సృష్టించింది.. ఇక ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టులో చివరి రోజు మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా ఆఖరి వికెట్ పడగొట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పాక్ పై 3-0 తేడాతో టెస్టు సిరీస్ క్లీన్ స్వీట్ చేసింది.. న్యూజిలాండ్ పర్యటనలో 1-1 తో సిరీస్ డ్రా చేసుకుంది.. ఆ తర్వాత స్వదేశంలో ఐర్లాండ్ జట్టుతో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో ఇంగ్లాండ్ సులభంగానే గెలిచింది.. ఆ తర్వాత ఆస్ట్రేలియా తో యాషెస్ సిరీస్ ను 2-2 తో డ్రా చేసుకుంది.
ఆస్ట్రేలియా తో యాషెస్ డ్రా తర్వాత భారత గడ్డపై ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. భారత్ లో బజ్ బాల్ కుదరదని, పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని ఆ జట్టు మాజీలు చెప్పినప్పటికీ మెక్ కల్లమ్ – బెన్ స్టోక్స్ ద్వయానికి చెవికి ఎక్కలేదు. ఆటతీరు మార్చుకోలేదు. పైగా హైదరాబాదులో సంచలన విజయం నమోదు కావడంతో.. అది ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా పెంచింది. కానీ ఆ తర్వాత జరిగిన టెస్టుల్లో యువభారత్ ఇంగ్లాండ్ జట్టు విశ్వాసాన్ని నేలకు దించింది. బజ్ బాల్ ను కుమ్మి అవతల పడేసింది. వైజాగ్ లో లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇబ్బంది పడింది. రాజ్ కోట్ లో మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఇక రాంచీ లో అయితే మరీ ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ లో ఆపసోపాలు పడింది. క్షేత్రస్థాయిలో ప్రతికూల ఫలితాలు వస్తున్నప్పటికీ బజ్ బాల్ ఆట తీరు మార్చుకోలేక నానా ఇబ్బందులు పడింది..అందుకే అంటారు అనువుగాని చోట అధికుల మనరాదు అని.. ఇక బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ 23 టెస్టులాడింది. ఇందులో 14 మ్యాచులు గెలిచింది. ఎనిమిది ఓడిపోయింది. ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. మెక్ కల్లమ్ – బెన్ స్టోక్స్ ద్వయం ఆధ్వర్యంలో 19 టెస్టులు ఆడితే.. 13 గెలిచింది. 4 ఓడిపోయింది. ఒక టెస్ట్ డ్రా గా ముగిసింది.