Pankaj Udhas: లెక్కకు మిక్కిలి షెహనాయిలు స్వరాలు ఒలికించినట్టు.. అనంతమైన వీణలు బాణీలు కూర్చినట్టు.. అతడు కూర్చితే పాట.. అతడు గొంతు విప్పితే అందమైన గజల్.. పాడుతున్నంతసేపు వినాలి అనిపించే మాధుర్యం.. ఒకటారెండా.. ఎన్నో గజల్స్ పాడి.. సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు పంకజ్ ఉదాస్. తన తుది శ్వాస వరకు పాటను విడిచిపెట్టలేదు. ఆ పాటతోనే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. విషాదాన్ని వర్ణించారు.. ఆనందాన్ని ఆవిష్కరించారు. బాధను ద్విగుణీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడి గొంతు స్వరరాగ గంగా ప్రవాహం. అన్ని గజల్స్ పాడిన ఆయన గొంతు శాశ్వత విశ్రాంతి తీసుకుంది. 72 సంవత్సరాల వయసులో సెలవంటూ కానరాని లోకాలకు వెళ్లిపోయింది.
నాయాబ్ ఉదాస్.. ఈ తరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చును గాని.. అంతకు ముందు తరాలకు ఉదాస్ అంటే వల్ల మాలిన అభిమానం. 1951 లో గుజరాత్ లోని జెటూర్ లో పంకజ్ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా.. పంకజ్ తన వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టారు. అతడి అన్న మనోహర్ ఉదాస్ బాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా రాణించడం కూడా పంకజ్ కు వరమైంది. రెండో అన్నయ్య నిర్మల్ ఉదాస్ గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకోవడంతో పంకజ్ కు మరింత బలాన్ని చేకూర్చింది. అలా చిన్నప్పటినుంచి తన అన్నయ్యలను చూసి పాటపై మరింత మక్కువ పెంచుకున్నారు. వారి సమక్షంలో సాధన చేశారు. అలా గజల్ గాయకుడిగా పేరు గడించారు. 1970లో వచ్చిన ‘తుమ్ హసీన్ మే జవాన్” సినిమాలో “చిట్టీ ఆయూ హై” అనే పాట పంకజ్ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది.
ఆ పాట తర్వాత ఆయన ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అలా 30 సంవత్సరాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. “చిట్టి ఆయిహై”, “చాంది జైసా రాంగ్ హై తేరా”, “ఔర్ ఆహిస్తా కిజియే బాతే”, “తోడి తోడి పియా కరో” ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన గొంతు నుంచి జాలువారాయి. కేవలం ఈ పాటలు మాత్రమే కాకుండా సొంతంగా ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా రూపొందించారు. గజల్ సింగర్ గా ఎక్కువ ప్రసిద్ది పొందారు. తన తుది శ్వాస వరకు ఆయన గజల్స్ ఆలపిస్తూనే ఉన్నారు.. ఆయన సేవలను గుర్తించి 2006లో అప్పటికేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.