https://oktelugu.com/

England Vs India: బంతితో స్పిన్నర్లు.. బ్యాట్ తో ఓపెనర్లు.. ధర్మశాలలో తొలిరోజు మనదే పై చేయి

వాస్తవానికి ఈ మైదానం సిమర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెప్పారు.. దాని ఆధారంగా ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో తర్వాత గాని అతడికి అర్థం కాలేదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 7, 2024 / 06:00 PM IST

    England Vs India

    Follow us on

    England Vs India: ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. వరుసగా మూడు టెస్టుల్లో ఓటమిపాలైంది. బజ్ బాల్ క్రికెట్ అభాసు పాలైంది. ఈ తరుణంలో ఇంగ్లాండ్ జట్టుకు ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. ఈ మ్యాచ్లో గెలిస్తే కనీసం పరువైనా దక్కుతుందని ఆ జట్టు భావించింది. అందుకే టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అది ఎంత తప్పుడు నిర్ణయమో 218 పరుగులకు ఆల్ అవుట్ అయితే గాని ఇంగ్లాండ్ తెలిసి రాలేదు.. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు విలవిలాడిపోయింది. స్పిన్ త్రయం బిగించిన ఉచ్చులో చిక్కుకుపోయింది.. ముఖ్యంగా చైనా మెన్ కులదీప్ యాదవ్ ఇంగ్లాండ్ టాప్ 5 వికెట్లు పడగొట్టడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రవిచంద్రన్ అశ్విన్ కూడా తన 100వ టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి అదరగొట్టాడు.

    వాస్తవానికి ఈ మైదానం సిమర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెప్పారు.. దాని ఆధారంగా ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. ఇది ఎంత తప్పుడు నిర్ణయమో తర్వాత గాని అతడికి అర్థం కాలేదు. తొలి వికెట్ కు జోడించిన 64 పరుగులే అత్యధిక వికెట్ భాగస్వామ్యం అంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. పిచ్ పై అవగాహన లేకపోవడం, వాతావరణంపై అంచనా లేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లకు దాసోహమయ్యారు. ముఖ్యంగా కులదీప్ యాదవ్ బౌలింగ్లో ఆడేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుమ్రా, సిరాజ్ నిప్పులు చెరిగే బంతులు వేసినా నిలదొక్కుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు.. స్పిన్నర్ల ధాటికి మాత్రం నిలవలేకపోయారు.. ఇంగ్లాండ్ జట్టులో క్రావ్ లీ (79) మాత్రమే రాణించాడు.. డకెట్(27), బెయిర్ స్టో(29), రూట్(26), ఫోక్స్(24) భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. పోప్(11), స్టోక్స్(0), హార్ట్ లీ(6), మార్క్ వుడ్(0), బషీర్(11), అండర్సన్ (0) నిరాశపరిచారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ డక్ అవుట్ కావడం ఆ జట్టు బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది.

    ఇంగ్లాండ్ జట్టు 218 పరులకు ఆల్ అవుట్ అయిన తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్- యశస్వి ద్వయం ఇంగ్లాండ్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగింది.. ముఖ్యంగా జైస్వాల్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో అర్థ శతకం సాధించాడు. ఇతడి దూకుడుకు భారత జట్టు తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద యశస్వి బషీర్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో 104 పరుగుల వద్ద తొలివికెట్టు భాగస్వామ్యానికి తెరపడింది. వన్ డౌన్ బ్యాటర్ గా గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. మరో ఎండ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 52 పరుగులు, గిల్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 26 పరుగులు చేశారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టపోయి 135 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ కు 83 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ ఒక వికెట్ తీశాడు.