India vs Australia 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై 155 పరుగులకే కుప్పకూలింది. నిలబడాల్సిన చోట.. కలబడాల్సిన చోట టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా చేతులెత్తేశారు. అనామక ఆటగాళ్లు లాగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా టీమిండియా కనీసం 200 మార్కు స్కోర్ కూడా చేయకుండానే ఆల్ అవుట్ అయింది. ఈ ఓటమితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-2 తేడాతో వెనుకబడింది. అంతేకాదు వరల్డ్ బెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ అవకాశాలను కూడా దాదాపు సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి దక్షిణాఫ్రికా వెళ్ళింది. అయితే తాజా విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ సెకండ్ ప్లేస్ దాదాపుగా ఖాయం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్స్ వెళ్లాలంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా అద్భుతాలు జరగాలి.
దారుణంగా విఫలమయ్యారు
ఆస్ట్రేలియా విధించిన 340 రన్స్ టార్గెట్ చేజ్ చేయడంలో టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. రాహుల్ ఏకంగా గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. ఇక రోహిత్ శర్మ అయితే మరోసారి తన ఫామ్ లేమి ని ప్రదర్శించాడు. కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి కేవలం ఒక పరుగు మాత్రమే చేసి లయన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ హెడ్ బౌలింగ్లో వెనుతిరగగా.. రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, బుమ్రా బోలాండ్ చేతికి చిక్కారు. సిరాజ్ లయన్ కు దొరికిపోయాడు. ఇలా కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 184 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండి ఆటగాళ్లపై విమర్శలు పెరిగిపోయాయి. కాగా, ఆదివారం భారత బౌలర్ల బౌలింగ్ దూకుడుతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ఇబ్బంది పడగా.. టెయిలెండర్లు నిలబడ్డారు. దాదాపు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ అదే టీమ్ ఇండియా బౌలర్లు చేతులెత్తేశారు. కనీసం ఐదు బంతులు కూడా ఎదుర్కోలేక వికెట్లు పోగొట్టుకున్నారు. నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించి దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. టీమిండియా అభిమానుల ఆశలను ఆడియాసలు చేశారు.