Rythu Bharosa: రైతు భరోసా.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్నదాతకు ఇచ్చిన ప్రధాన హామీ. రైతులకు సాగులో భాగంగా పెట్టుబడి సాయం అందించడమే ఈ పథకం ఉద్దేశం. అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేసి తీరుతామని స్వయంగా రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఏడాది కూడా గడిచింది. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ చేపట్టిన హస్తం పార్టీ రైతు భరోసా అమలుపై ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.
*సంక్రాంతికి అమలు చేసేలా..*
రైతు భరోసా పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి. ఇప్పటికే అన్నదాతకు సంబంధించిన రూ.2లక్షల లోపు రైతు రుణ మాఫీ ప్రక్రియ చేపట్టిన రేవంత్ సర్కారు ప్రస్తుతం రైతు భరోసా అమలులో భాగంగా విధి విధానాలపై కసరత్తు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘాన్ని సైతం నియమించింది. ఈ ఉప సంఘం ఇప్పటికే పలుమార్లు సమావేశం కాగా ఆదివారం కూడా మరోసారి సమావేశమైంది. అయితే అర్హులెవరు, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి.. యాసంగి, వానాకాలం సీజన్లలో పంటల సాగు హెచ్చుతగ్గులు వంటి ప్రధాన అంశాలపై ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. మరోవైపు సమావేశం కానున్నట్లు సమాచారం. సంక్రాంతికి పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్వయంగా సీఎం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
*రైతు బంధు టూ రైతు భరోసా*
గత బీఆర్‌ఎస్ సర్కారు రెండో సారి ఎన్నికల సందర్భంగా అన్నదాతకు పెట్టుబడి సాయం అందించడంలో భాగంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తెచ్చింది. తొలుత ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు సీజన్లకు గాను ఎనిమిది వేలుగా అందజేసింది. తర్వాత ఈ మొత్తం రూ.5వేల చొప్పున రూ.10వేలకు పెంచింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు భరోసా కింద అమలు చేస్తామని ప్రకటించినా డిసెంబర్‌లో కొలువుతీరగానే విధి విధానాల రూపకల్పన ఆలస్యం కావడంతో పాత మాదిరిగానే రూ.ఎకరాకు రూ5వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది.
*అర్హులు, విధి విధానాలపై కసరత్తు..*
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంట భూమి నుంచి ఎన్ని ఎకరాల భూమి ఉన్న రైతు అయినా ఈ పథకాన్ని వర్తింపజేసింది. అయితే వందల ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో సైతం దీనినే ప్రధానంగా ప్రస్తావించింది. అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని కేవలం సాగు చేసే రైతులకే వర్తింపజేస్తామని, వందల ఎకరాల ఆసాములు, వ్యాపారులను మినహాయించి అమలు చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం అర్హులు, పథకం విధి విధానాలపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ రూపొందిచడంతో పాటు రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించాలని యోచిస్తోంది. అలాగే ఐటీ చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులను అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.