India Team Fitness test: ఆటగాళ్లలో సామర్థ్యం సరిగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితం వస్తుంది. ఆ సామర్ధ్యాన్ని సాధించాలంటే ఆటగాళ్లు కచ్చితంగా కొన్ని ప్రమాణాలు పాటించాలి. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి. మైదానంలో కసరత్తులు చేయాలి. ప్రాక్టీసులో ఒళ్ళు వంచాలి. ఒక రకంగా చెమటను చిందించాలి. అప్పుడే జట్టుకు అనుకూలమైన ఫలితం వస్తుంది. ఇలా కాకుండా బొజ్జలు పెంచి.. నడుము వంచకుండా.. చెమట చిందించకుండా ఆడితే ఓటమే ఎదురవుతుంది.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించకపోతుండడంతో మేనేజ్మెంట్ సామర్ధ్య పరీక్షను తీసుకొచ్చింది. బిసిసిఐ హెడ్ క్వార్టర్స్ లో ఈ పరీక్ష నిర్వహించింది. విరాట్ కోహ్లీ లండన్ లో ఉన్నందున అతడు అక్కడి నుంచే తన సామర్ధ్య పరీక్షను నిరూపించుకున్నాడు. అయితే ఈ సామర్ధ్య పరీక్షలో ఆటగాళ్లు మొత్తం విజయవంతమయ్యారట. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ ప్రకటించింది. వివరాలను మాత్రం మేనేజ్మెంట్ బయట పెట్టలేదు.. అయితే ఆటగాళ్ల ఎంపికకు సామర్ధ్య పరీక్షలు ప్రామాణికం కాదని మేనేజ్మెంట్ డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతోంది.
వాస్తవానికి రవి శాస్త్రి హయంలో యోయో పరీక్ష నిర్వహించేవారు. అందులో విజయవంతమైన ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. అందువల్లే అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. ఇంకా అనేక టోర్నీలలో సత్తా చూపించింది. ఇప్పుడు నిర్మించిన బ్రాంకో టెస్ట్ కేవలం నామమాత్రమైన దేనట. ఆటగాళ్ల ఎంపికకు ఈ టెస్ట్ ప్రామాణికం కాదట. అలాంటప్పుడు ఈ టెస్ట్ ఎందుకు నిర్వహించినట్టు.. ఎందుకు ఇంత హంగామా చేసినట్టు.. ఒకవేళ ఆటగాళ్లు అందులో విఫలమైతే.. అదే తంతు మైదానంలో కూడా కొనసాగిస్తే టీమిండియా ప్రతికూల ఫలితం వస్తుంది కదా. అలాంటప్పుడు మేనేజ్మెంట్ ఈ స్థాయిలో హంగామా చేయడం ఎందుకు.. ఆటగాళ్ల లాబియింగ్ కు తలవంచే మేనేజ్మెంట్.. గొప్ప గొప్ప ఫలితాలను ఎలా సాధిస్తుంది.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమానిలో మెదులుతున్నాయి.
సామర్ధ్యాన్ని నిరూపించుకుంటేనే..
అంతటి ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్లు సామర్థ్యాన్ని నిరూపించుకోకపోతే మొహమాటం లేకుండా పక్కన పెడతారు. అతడు మైదానంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకునేంతవరకు అవకాశాలు ఇవ్వరు. కాని టీమిండియాలో ఇలా జరగదు. జరిగే అవకాశం లేదని తాజా పరిణామం నిరూపిస్తోంది.