https://oktelugu.com/

Ind Vs Aus: తెలుగోడు ఆదుకున్నాడు.. లేకుంటే భారత్ పరువు గంగలో కలిసేది.. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పరిస్థితి ఏంటంటే?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు ముందు బెంబేలెత్తి పోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 / 01:16 PM IST

    Ind Vs Aus(2)

    Follow us on

    Ind Vs Aus:  ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 50 పరుగుల లోపే ఆల్ అవుట్ అయి పరువు తీసుకుంది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత్ అలానే కుప్పకూలేది. అయితే తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కాస్తలో కాస్త ప్రతిఘటించడంతో టీమిండియా కు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. లేకుంటే బెంగళూరు మాదిరిగానే పరువు పోయేది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పరుగులేమీ చేయకుండానే( ఎక్స్ ట్రా ల రూపంలో 5 పరుగులు వచ్చాయి) ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) వికెట్ పోగొట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్(0) కూడా గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దీంతో 14 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన విరాట్ (5) దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఫలితంగా 32 పరుగులకే భారత్ 3 వికెట్లు నష్టపోయింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37) బాధ్యతాయుతంగా ఆడినప్పటికీ.. కేఎల్ రాహుల్ వివాదాస్పద స్థితిలో ఔట్ కావడంతో భారత్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ దశలో వచ్చిన జూరెల్(11), వాషింగ్టన్ సుందర్ (4) వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. ఈ క్రమంలో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి (41) సత్తా చాటడంతో భారత్ స్కోర్ బోర్డ్ లో కాస్త కదలిక వచ్చింది.. హర్షిత్ రాణా(7), బుమ్రా(8), వెంట వెంటనే అవుట్ అయ్యారు. తోడుగా నిలిచే ఆటగాళ్లు లేకపోవడంతో హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న.. నితీష్ కుమార్ రెడ్డి కమిన్స్ బౌలింగ్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

    సత్తా చాటిన ఆస్ట్రేలియా బౌలర్లు

    పేస్ బౌలింగ్ కు సహకరిస్తున్న పెర్త్ మైదానంపై ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతమైన గణాంకాలు నమోదు చేశారు. టీమిండియా ఏ దశలోనూ భారీ స్కోరు చేయకుండా ఎక్కడికక్కడ కట్టడి విధించారు.. జోష్ హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు..స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడం బుర్ర తక్కువ నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. మైదానం పేస్ బౌలింగ్ కు సహకరిస్తుందని తెలిసినప్పటికీ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన విధానం కాదని విమర్శిస్తున్నారు. అయితే న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఓటమి నేర్చుకొని భారత బ్యాటర్లు.. ఆస్ట్రేలియా సిరీస్ లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 5 పరుగులు చేయడం, యశస్వి జైస్వాల్, దేవదత్ సున్నా పరుగులకు అవుట్ కావడాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి ఆటగాళ్లను ఈ సిరీస్ కు ఎందుకు ఎంపిక చేశారని సెలక్షన్ కమిటీని ప్రశ్నిస్తున్నారు.