Ind W Vs SL W 1st T20: టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. కొద్దిరోజులు గ్యాప్ తీసుకుంది. మళ్లీ ఇప్పుడు మైదానంలోకి అడుగు పెట్టబోతోంది. వన్డే వరల్డ్ కప్ సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు ప్రతిష్టాత్మకమైన శ్రీలంక సిరీస్ కు సిద్ధమైంది. ఈ సీరియస్ లో టీమిండియా, శ్రీలంక జట్లు 5 t20 మ్యాచులు ఆడతాయి. తొలి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. టీమ్ ఇండియాకు హర్మన్ ప్రీత్ సారథ్యం వహిస్తుంది.
వన్డే వరల్డ్ కప్ సాధించిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ లో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే టీమ్ ఇండియా ప్లేయర్లు మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ సాధించిన తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల మద్దతు టీమిండియా ప్లేయర్లకు భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇదే వేదికగా వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు మ్యాచ్ ఆడింది.. ఫలితం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. భారత క్రికెటర్లకు స్థానిక ప్రేక్షకుల మద్దతు విపరీతంగా లభించింది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో క్రికెటర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టుతో ఐదు టి20 మ్యాచ్ సిరీస్ ను విశాఖపట్నం వేదిక నుంచి టీమిండియా మొదలుపెట్టనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అమ్ముడుపోయాయని విశాఖపట్నం మైదానం నిర్వాహకులు పేర్కొంటున్నారు.
సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రసారమవుతుంది. ఓటీటీలో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. టీమిండియాలో హర్మన్ ప్రీత్, జమీమా, రేణుక, దీప్తి, శపాలీ, హర్లిన్ డియోల్ వంటి వారు ఉన్నప్పటికీ.. అందరి దృష్టి స్మృతి మీద ఉంది. ఎందుకంటే ఇటీవల పలాష్ ముచ్చల్ తో వివాహం రద్దయిన తర్వాత.. కొద్దిరోజులకే స్మృతి బయటికి వచ్చింది. మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అంతేకాదు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్. లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి తన మీద ఉన్న ఒత్తిడి మొత్తం జయించాలని స్మృతి భావిస్తోంది.
ఈ మ్యాచ్ యువ క్రికెటర్లకు పరీక్ష అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్ ద్వారా యువ బ్యాటర్ కమలిని, స్పిన్నర్లు శ్రీ చరణీ, వైష్ణవి శర్మ ప్రదర్శనను నిశితంగా పరిశీలించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇప్పటివరకు టీమిండియా, శ్రీలంక t20 లలో 26 సార్లు తలపడ్డాయి. 20 సార్లు విజయం సాధించి టీమిండియా లీడ్ లో కొనసాగుతోంది.