Ind vs SA 1st T20 Live : టీమిండియాలో చోటు లభించినప్పటికీ.. అతడు దానిని ఉపయోగించుకోలేడు. అనేక మ్యాచ్ లలో అవకాశం కల్పించినప్పటికీ అతడు నిలుపుకోడు.. అందువల్లే అతడు నిలబడలేక పోతున్నాడు. స్టార్ క్రికెటర్ గా ఎదగలేక పోతున్నాడు..ఇవీ టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ పై మొన్నటివరకు వ్యక్తమైన అభిప్రాయాలు.
ఇకపై క్రికెట్ విశ్లేషకులు పై అభిప్రాయాలను సంజు విషయంలో మార్చుకోవాలేమో.. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టును ముందుండి నడిపించి.. సెమీఫైనల్ దాకా తీసుకెళ్లిన సంజు.. టి20 క్రికెట్లో జాతీయ జట్టు తరఫున ఆడుతూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో సంజు 47 బంతులలో 111 పరుగులు చేశాడు.. ఇక శుక్రవారం దక్షిణాఫ్రికా జట్టుతో మొదలైన నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ లోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. డర్బన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. 50 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 10 సిక్సర్లు కొట్టాడు. బౌలర్ ఎవరైనా సరే బాదుడే పనిగా పెట్టుకున్నాడు. మిగతా ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. అతడు మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. టీమ్ ఇండియా స్కోరును ముందుకు నడిపించాడు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 202 రన్స్ చేసింది.
సంచలన రికార్డు
దక్షిణాఫ్రికా పై 107 పరుగులు చేసిన సంజు శాంసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్పిన్ బౌలర్ల బౌలింగ్ లో అత్యధిక పరుగులు చేసిన రెండవ భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.. 2024లో హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఇతర అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత సంజు రెండవ స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో హైదరాబాద్ వేదికగా 2024 లో జరిగిన టి20 మ్యాచ్లో 23 బంతులు ఎదుర్కొని సంజు 64 పరుగులు చేశాడు. ఇక డర్బన్ వేదికగా 2024లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 మ్యాచ్ లో సంజు 27 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు. ఇక 2012లో పాకిస్తాన్ జట్టుపై యువరాజ్ సింగ్ అహ్మదాబాద్ వేదికగా 24 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అయితే ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలు సంజు పేరు మీద ఉండడం విశేషం. ఈ రికార్డు మాత్రమే కాదు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ పై సెంచరీ చేసిన సంజు.. దక్షిణాఫ్రికా పై కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ చేశాడు. సంజు కంటే ముందు ఫ్రెంచ్ ఆటగాడు గుస్తావ్ మేకాన్, రిలే రోసౌ(దక్షిణాఫ్రికా), సాల్ట్(ఇంగ్లాండ్) ఉన్నారు. మరో సెంచరీ చేస్తే సంజు వీరందరి కంటే ముందు వరుసలో ఉంటాడు. హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.