https://oktelugu.com/

Ind vs SA 1st T20 Live : సంజు మరో సెంచరీ.. బెంబేలెత్తిపోయిన దక్షిణాఫ్రికా.. భారత్ స్కోర్ ఎంతంటే?

బౌలర్ బంతిని వేయడమే ఆలస్యం.. కసి కొద్ది కొట్టాడు. అయితే ఫోర్ లేకుంటే సిక్సర్.. ఇలా ఊర మాస్ బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా బౌలర్లకు నిర్వేదం.. అతడికి ఏమో అచంచలమైన ఉత్సాహం.. సీన్ కట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ సెంచరీ..

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2024 / 10:49 PM IST

    Sanju Samson

    Follow us on

    Ind vs SA 1st T20 Live : నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా లో భారత్ పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం డర్బన్ వేదికగా తొలి టీ-20 మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బౌన్సీ మైదానాలు కావడంతో.. టీమిండియాను త్వరగానే ప్యాకప్ చేసి మ్యాచ్ గెలవాలని కెప్టెన్ మార్క్రం భావించాడు. కానీ రియాల్టీలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఓపెనర్ సంజు శాంసన్ విధ్వంసం సృష్టించడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(7) ఎప్పటిలాగానే విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ (21) ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. తిలక్ వర్మ (33) మెరుపులు మెరిపించినా భారీ స్కోరుగా మలచ లేకపోయాడు. అయినప్పటికీ సంజు ఒంటరి పోరాటం చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 50 బంతుల్లో 107 రన్స్ చేశాడు. ఇందులో ఆర్ ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే దూకుడు కొనసాగించబోయిన సంజు చివరికి పీటర్ బౌలింగ్లో స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు అభిషేక్ శర్మతో వికెట్ కు 24, సూర్య కుమార్ యాదవ్ తో రెండో వికెట్ కు 66 తిలక్ వర్మతో మూడో వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

    సిక్సర్ల మీద సిక్సర్లు

    దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఊచకోత కోసిన సంజు.. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు. అతడి ఇన్నింగ్స్ లో పది సిక్సర్లు ఉన్నాయంటే.. బ్యాటింగ్ ఎంత దూకుడుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో 47 బంతుల్లోనే సంజు 111 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ప్రస్తుత మ్యాచ్ లో 50 బంతులు ఎదుర్కొని 107 పరుగులు చేశాడు.. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. సంజు కంటే ముందు గుస్తావ్ మేకాన్, రిలే రోసౌ, సాల్ట్ ఉన్నారు. వీరు గతంలో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లలో సెంచరీలు చేశారు. ఇప్పుడు వారి సరసన సంజు శాంసన్ చేరాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఈ ఘనతను అందుకున్న తొలి ఆటగాడిగా అతడు నిలిచాడు. కడపటి వార్తలు అందే సమయానికి 18 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రింకూ సింగ్(7), అక్షర్ పటేల్ (6) క్రీజ్ లో ఉన్నారు. అయితే హార్దిక్ పాండ్యా(2) నిరాశ పరచడంతో టీమిండియా అనుకున్నంత స్థాయిలో భారీ స్కోర్ చేయలేకపోయింది.. ఒకవేళ ప్రారంభంలో కొనసాగించిన దూకుడు చివరి వరకు ప్రదర్శించి ఉంటే భారత్ సులభంగా 250+ పరుగులు చేసి ఉండేది.