IND Vs PAK: 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ (IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ ఫైనల్ లో తలపడ్డాయి. సహజంగా ఐసిసి టోర్నీలలో భారత్ పాకిస్తాన్ తల పడినప్పుడు.. భారత జట్టుకే కాస్త అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. గత చరిత్ర కూడా ఇదే చెబుతోంది .. అయితే ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఎదుట నిలబడలేకపోయింది.. బౌలింగ్ లో విఫలమైంది. బ్యాటింగ్లో చేతులెత్తేసింది.
ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమ్ ఇండియాకు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత లభించింది. చాంపియన్స్ ట్రోఫీ లో ఓటమి తర్వాత 2023 వన్డే వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ జట్టును ఓడించింది. అయినప్పటికీ భారత జట్టులో ఏదో వెలితి కనిపించింది. చివరికి దుబాయ్ లో నిన్న జరిగిన లీగ్ మ్యాచ్లో గెలుపు ద్వారా టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. పాకిస్తాన్ జట్టుపై టీం ఇండియా గెలిచిన నేపథ్యంలో భారత ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దాయాది జట్టుపై కొనసాగించిన అద్భుతమైన ఆట తీరు సర్వత్రా హర్షానికి కారణమవుతోంది.
కొత్త కోచ్ ను నియమించుకున్నప్పటికీ..
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో.. పాకిస్తాన్ భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే భారత జట్టుతో జరిగే మ్యాచ్లో గెలిస్తేనే పాకిస్తాన్కు సెమిస్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎలాగైనా భారత జట్టుపై గెలుపొందాలని పాకిస్తాన్ జట్టు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ఒక కోచ్ ను నియమించుకుంది.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్, సెలెక్టర్ అఖీబ్ జావేద్ తన మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్(Mudassar Nazar) ను సహాయం అర్జించాడు. ముదస్సర్ నాజర్(Mudassar Nazar) కు దుబాయ్ మైదానంపై స్పష్టమైన అవగాహన ఉంది. పైగా అతడు కొన్ని సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటున్నాడు. ఐసీసీ గ్లోబల్ అకాడమీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. జావేద్ కోరిక నేపథ్యంలో ముదస్సర్ నాజర్(Mudassar Nazar) పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. నెట్ సెషన్ లో పాల్గొన్నారు. ఆటగాళ్లకు అనేక అంశాలపై సూచనలు చేశాడు. అయితే
ముదస్సర్ నాజర్(Mudassar Nazar) ఇచ్చిన విలువైన సూచనలను పాకిస్తాన్ ఆటగాళ్లు పాటించనట్లు కనిపిస్తోంది. టాస్ నెగ్గినప్పటికీ పాకిస్తాన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం ముదస్సర్ నాజర్(Mudassar Nazar) కు కూడా నిరాశ కలిగించిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ” కొత్త కోచ్ ను తాత్కాలికంగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ కోసం పాకిస్తాన్ నియమించుకుంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతడు చేసిన సూచనలను పాకిస్తాన్ ఆటగాళ్లు పట్టించుకోనట్లు కనిపిస్తోంది. అందువల్లే పాకిస్తాన్ భారత జట్టుపై విజయం సాధించలేకపోయిందని” జాతీయ మీడియా తను ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది.