Champions Trophy 2025 IND Vs PAK: ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని దూరం చేసిన పాకిస్తాన్ పై ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.. భారత అభిమానులు కూడా రోహిత్ సేనను ప్రతీకారం తీర్చుకోవాలని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కోరుతున్నారు.. ఛాంపియన్స్ ట్రోఫీలో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ తొలి మ్యాచ్ న్యూజిలాండ్ (PAK vs NZ ) జట్టుతో ఆడింది. సొంత గడ్డపై ఆడినప్పటికీ పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా ఉత్సాహంతో కనిపిస్తోంది.. మరోవైపు పాకిస్తాన్ జట్టుకు ఫకర్ జమాన్ దూరమయ్యాడు. బాబర్ ఆజాం ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు టీమ్ ఇండియాకు బుమ్రా లేకపోయినప్పటికీ షమీ భారత బౌలింగ్ ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. బంగ్లా పై జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరో బౌలర్ హర్షిత్ రాణా కూడా అదరగొడుతున్నాడు. స్పిన్నర్లలో అక్షర్ పటేల్ మాయాజాలం చేస్తున్నాడు. రోహిత్ టచ్ లోకి వచ్చాడు.గిల్ శతక గర్జనతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరూ కనుక క్లిక్ అయితే పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇక స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గతంలో చూపించిన లయను ప్రదర్శిస్తే పాక్ జట్టుకు ఇబ్బందులు తప్పవు.
తొలి మ్యాచ్లో ఓటమితో
తొలి మ్యాచ్లో ఓటమితో పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశలో కూరుకు పోయింది. ఆ జట్టు సెమిస్ వెళ్లాలంటే భారత్ పై ఖచ్చితంగా గెలవాలి. మరోవైపు సెమిస్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలంటే టీమిండియా పాకిస్తాన్ పై కచ్చితంగా విజయం సాధించాలి. ఒకవేళ పాకిస్తాన్ కనుక భారత్ చేతిలో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అయితే పాకిస్తాన్ చెట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే భారత జట్టుతో మ్యాచ్ అంటే ఆ జట్టు ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ -పాకిస్తాన్ ఐదుసార్లు తలపడగా.. మూడుసార్లు పాక్, రెండుసార్లు భారత్ గెలిచాయి. 2004, 2009, 2013లో ఇరు జట్లు ఒక్కొక్కసారి తలపడ్డాయి. చివరిసారిగా 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది.. అయితే 2017లో ట్రోఫీని పాకిస్తాన్ దూరం చేసిన నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా పాకిస్తాన్ జట్టును ఓడించాలని భారత్ భావిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లలో భారత్ పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. రేపు జరిగే మ్యాచ్లో కూడా విజయం సాధిస్తే హాట్రిక్ గెలుపులను సొంతం చేసుకుంటుంది. 2017లో ఎదురైన ఓటమికి ఖచ్చితమైన ప్రతీకారం తీర్చుకోవాలని.. దాయాది జట్టుకు కోలుకోలేని షాక్ ఇవ్వాలని రోహిత్ సేనను భారత అభిమానులు కోరుతున్నారు. దుబాయ్ లో ఆదివారం జరిగే వన్డేలో భారత్ కనుక పాకిస్తాన్ జట్టును ఓడిస్తే.. దాయాది జట్టుకు సెమిస్ వెళ్లే అవకాశాలు ఉండవు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమిస్తుంది.