Ind vs Ban : సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన టి20, వన్డే సిరీస్ తర్వాత భారత జట్టుకు దాదాపు 45 రోజుల విరామం లభించింది. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత టీమిండియా చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ ద్వారా మైదానంలోకి అడుగుపెడుతోంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇటీవల ప్రకటించింది. హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ గంభీర్ కు ఇదే తొలి టెస్ట్. ఇప్పటికే భారత ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. ఎరుపు రంగు బంతితో సాధన మొదలుపెట్టారు. గంటల తరబడి నెట్స్ లో సాధన చేస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయకుండా.. అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు.
పకడ్బందీ వ్యూహాలు
బంగ్లాదేశ్ జట్టుతో జరిగే తొలి టెస్ట్ కోసం భారత జట్టు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. మేనేజ్మెంట్ కూడా పట్టిష్టమైన ప్రణాళికలు పొందిస్తోంది. తొలి టెస్ట్ లో ప్రయోగాలకు పెద్దపీట వేయకుండా.. ఒక పాత విధానాన్ని టీమిండియా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.. ఈ క్రమంలో ముగ్గురు స్పిన్నర్ల విధానానికి స్వస్తి పలకనుంది. వాస్తవానికి టీమిండియా సొంత గడ్డపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఐదు సంవత్సరాల క్రితం టీమిండియా వ్యూహాన్ని అమలు చేసింది. ఇక చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు రెడ్ సాయిల్ పిచ్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నై మైదానం స్పిన్ బౌలర్లకు స్వర్గధామం లాగా ఉంటుంది. వాస్తవానికి బంగ్లాదేశ్ జట్టుకు బ్లాక్ సాయిల్ పిచ్ పై ఆడిన అనుభవం ఉంది. ఇక స్వదేశంలో ఆ జట్టు ఎక్కువగా స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే బ్లాక్ సాయిల్ పిచ్ లపై ఆడుతుంది. ఈ నేపథ్యంలో పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే రెడ్ సాయిల్ పిచ్ ను తొలి టెస్ట్ కోసం రూపొందిస్తున్నట్టు స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐదు రోజులపాటు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి.. మైదానంపై గడ్డిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వారికి అవకాశం లేదు
టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు అవకాశం లభించదు. పేస్ బౌలర్లుగా బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మూడో పేస్ బౌలర్ గా యష్ దయాళ్ లేదా ఆకాష్ దీప్ కు ఆ అవకాశం లభిస్తుంది. అయితే ఇందులో యష్ కు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇక 2019లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ టెస్ట్ ఆడింది. అప్పుడు గులాబీ రంగు బంతితో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో పేస్ బౌలర్లు ఎక్కువ వికెట్లు తీయడం విశేషం.