IND vs BAN : స్థానిక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మూడోరోజు బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో తన విశ్వరూపం చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో అంతగా ఆకట్టుకోని రవిచంద్రన్ అశ్విన్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన బౌలింగ్ విన్యాసాన్ని బంగ్లా ఆటగాళ్లకు రుచి చూపించాడు. ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయింది. 158 పరుగులు చేసింది. మరో 357 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ విజయం సాధించినట్టే. ప్రస్తుతం ఆ జట్టుకు చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మైదానం పరిస్థితి చూస్తే ఆదివారం తొలి సెషన్ ముగిసే సమయం నాటికి బంగ్లా ఆట ముగుస్తుందని స్పోర్ట్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త బంతితో భారత బౌలర్లను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు కత్తి మీద సాము లాంటిదే. ఇక మిగిలిన రెండు రోజులు డ్రా కోసం పోరాడాలంటే బంగ్లాదేశ్ చెట్టుకు అంత సులభం కాదు. అలాంటప్పుడు ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడం కోసం బంగ్లా జట్టు రేపు కాస్తలో కాస్త పోరాడే అవకాశం ఉంది.
వర్షం కురిసే అవకాశం
ఆదివారం చెన్నైలో వర్షం కురిసే అవకాశం ఉంది. భారత గెలుపును ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. శనివారం మరో 9.4 ఓవర్ల పాటు ఆట కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. సరైన వెలుతురు లేకపోవడంతో ఆటను విరమించారు. మేఘాలు కమ్ముకోవడం వల్ల అక్కడ వెలుతురు లేమి ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదివారం, సోమవారం చెన్నైలో వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షం లేదుగాని.. ఆటకు అంతరాయం కలగచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మైదానం స్పిన్ బౌలర్లకు స్వర్గధామం లాగా మారింది. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. మరోవైపు క్రీజ్ లో బంగ్లా కెప్టెన్ శాంటో(51*), షకీబ్ అల్ హసన్ (5*) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ సీనియర్ ఆటగాళ్ళే అయినప్పటికీ.. భారత బౌలర్లను ఏ స్థాయిలో ఎదుర్కొంటారనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరిద్దరూ ధైర్యంగా ఆడితే ఓటమి అంతరాన్ని తగ్గించగలరు. ఒకవేళ మిగిలిన రెండు రోజుల ఆటలో కనీసం రెండు సెషన్లు కొనసాగితే భారత్ విజయం సాధించినట్టే. ఇలాంటి సమయంలో బంగ్లా జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే వాన కురవడం ఒకటే మార్గం.
రోహిత్ శర్మ ముందుగానే ఊహించాడు
వర్షం ఇబ్బంది పెడుతుందని ముందుగానే భావించి.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.. రాహుల్ అర్ధ శతకం చేస్తాడని.. గిల్ 150 పరుగులు పూర్తి చేస్తాడని రోహిత్ శర్మ అనుకోలేదు. జట్టు విజయాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు వెంటనే ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు. రెండవ ఇన్నింగ్స్ ను శనివారం మొదలుపెట్టిన టీమిండియా 81/3 నుంచి 287/4 దాకా స్కోరును తీసుకెళ్లింది. గిల్(119*), పంత్ (109) సెంచరీలతో ఆకట్టుకున్నారు..కాగా, మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 రన్స్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 113, రవీంద్ర జడేజా 86 పరుగులతో సత్తా చాటారు.