https://oktelugu.com/

IND Vs AUS: పెర్త్ టెస్ట్ ముందు భారత్ ను వేధిస్తున్న ఆ సమస్య.. నితీష్, హర్షిత్ లేపనం అవుతారా?!

ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియా కు అసలైన సమస్య ఏర్పడింది.. ఈ సమస్యకు తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కాస్త లేపనం లాగా అనిపించినప్పటికీ.. ఇది పూర్తిస్థాయిలో సరిపోదు. ఎందుకంటే జట్టు అవసరాలు అలా ఉన్నాయి కాబట్టి..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 / 08:28 AM IST

    IND Vs AUS

    Follow us on

    IND Vs AUS: టీమిండియాలో నాణ్యమైన ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్ ఉండేవాడు. అతని ఆధ్వర్యంలో భారత్ వరల్డ్ కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్లో కపిల్ దేవ్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంతో జట్టు విజయం సాధించింది. బలమైన వెస్టిండీస్ ను ఓడించింది. అయితే అలాంటి ఆల్ రౌండర్ టీమ్ ఇండియాకు ఇప్పటివరకు దొరకలేదు. చదువుతుంటే మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. మొన్నటిదాకా హార్దిక్ పాండ్యా కపిల్ దేవ్ పాత్రను పోషిస్తాడని అందరూ అనుకున్నప్పటికీ.. గాయాలు కావడంతో అతడు టెస్ట్ క్రికెట్ కు తాత్కాలికంగా దూరమయ్యాడు. 2018 సెప్టెంబర్ లో అతడు తన చివరి టెస్ట్ ఆడాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత జట్టుకు స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ లకు కొదవలేదు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆ పాత్రను పోషిస్తున్నారు. కానీ భారత జట్టుకు కావాల్సిందల్లా పేస్ ఆల్ రౌండర్లు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, వికెట్లు సాధించాల్సిన సమయం ఏర్పడినప్పుడు, పరుగులు తీయాల్సిన సందర్భం ఎదురైనప్పుడు.. జట్టుకు పేస్ ఆల్ రౌండర్లు అత్యంత అవసరం.

    నితీష్ రెడ్డి సరే..

    తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి బ్యాటర్ గా పర్వాలేదనిపించుకున్నాడు. అయితే బౌలింగ్ విషయంలో అతడు సత్తా రావాల్సి ఉంది.. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో నితీష్ రెడ్డి 34 బంతుల్లో 74 రన్స్ చేశాడు. ఈ ప్రదర్శనతోనే ఆస్ట్రేలియా టూర్ లో చోటు దక్కించుకున్నాడు.. ఆస్ట్రేలియా మైదానాలపై గ్రిప్ సాధించేందుకు అతడిని ముందుగానే అక్కడికి పంపారు. అయితే ఆస్ట్రేలియా – ఏ జట్టుతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లలో నితీష్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. బ్యాటర్ గా ఆకట్టుకోలేదు. బౌలర్ గా సత్తా చాటలేదు. తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో అతడు 0 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టులో తొలి రెండు ఇన్నింగ్స్ లలో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పెర్త్ వేదికగా అతడు టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఓకే అయింది. అయితే అతడు తుది జట్టులో స్థానం లభిస్తే ఆస్ట్రేలియా జట్టును బలంగా ఎదుర్కొంటాడా? లేక ఇటీవల వైఫల్యాన్ని మళ్ళీ ప్రదర్శిస్తాడా? అనేది తేలాల్సి ఉంది.

    హర్షిత్ సద్వినియోగం చేసుకుంటాడా

    నితీష్ తో పాటు హర్షిత్ రాణా భారత యువ ఆశాకిరణంగా వెలుగొందుతున్నాడు. సరైన ఎంట్రీ కోసం ఇతడు ఎదురుచూస్తున్నాడు. హర్షిత్ 2023 దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున బరిలోకి దిగాడు. నార్త్ ఈస్ట్ జోన్ పై జరిగిన మ్యాచ్లో 86 బంతుల్లోనే 122 రన్స్ చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ సీజన్లో రంజీ ట్రోఫీలో 78 బంతులు ఎదుర్కొని 59 రన్స్ చేశాడు. ఈ యువ ఆటగాడిని సాన పెడితే టీమిండియా కు తిరిగి ఉండదు. ఇతడు రాటు తేలితే అద్భుతమైన ఆల్ రౌండర్ జట్టుకు లభిస్తాడు. హర్షిత్ మంచి వేగంతో బౌలింగ్ చేస్తాడు. జట్టు అవసరాల దృష్ట్యా అతడికి తొలి టెస్ట్ లో ఆడే అవకాశం లభించవచ్చు. అయితే దీనిని సద్వినియోగం చేసుకునే దానిపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.