IND Vs AUS 5th Test: సిడ్నీ వేదికగా ఐదో టెస్టు శుక్రవారం నుంచి భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 నుంచి మొదలవనుంది. ఈ టెస్టులో కచ్చితంగా గెలవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా మెల్ బోర్న్ టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉంది. దీంతో ఆస్ట్రేలియాను టీమిండియా ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మెల్ బోర్న్ టెస్టులో హెడ్ విఫలమైనప్పటికీ.. స్మిత్, లబూ షేన్ సత్తా చాటారు. రెండవ ఇన్నింగ్స్ లో లబూ షేన్, కమిన్స్, లయన్ అదరగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా 340 రన్స్ టార్గెట్ ను టీమిండియా ఎదుట ఉంచింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను గనుక టీమ్ ఇండియా బౌలర్లు త్వరగా అలౌట్ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. మిగతా బౌలర్లు ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు. దీంతో ఆస్ట్రేలియా మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేస్తోంది. అది అంతిమంగా భారత జట్టును ఇబ్బందికి గురిచేస్తుంది. ఒత్తిడి కూడా పెంచేలా చేస్తోంది. అయితే బుమ్రా మాదిరిగా ఇతర బౌలర్లు కూడా బౌలింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనం ఉంటుంది. ఆస్ట్రేలియాను నిలువరించే అవకాశం కూడా ఉంటుంది.. అడిలైడ్, బ్రిస్ బేన్ టెస్టులలో రాణించిన హెడ్.. మెల్ బోర్న్ లో అవుట్ అయ్యాడు. అతడు సిడ్ని టెస్టులో మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. అతడిని టీమిండియా త్వరగా కట్టడి చేసి.. మిగతా వారిని కూడా అదే తీరుగా పెవిలియన్ పంపించాలి. అప్పుడే టీమిండియా కు అడ్వాంటేజ్ లభిస్తుంది.
బ్యాటింగ్ ఆర్డర్ మారాలి
బ్యాటింగ్లో సీనియర్ ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి మినహ మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. రిషబ్ పంత్ తన బాధ్యత 30పరుగుల వరకే అన్నట్టుగా ఆడుతున్నాడు. అతడు తన పరుగులను భారీ స్కోరుగా మార్చాల్సిన అవసరం ఉంది. రాహుల్ తన వైఫల్యాలకు చెక్ పెడితేనే టీమ్ ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభిస్తుంది. రవీంద్ర జడేజా బ్రిస్ బేన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. రోహిత్, విరాట్ ఈ సంవత్సరమైనా నూతన ఆరంభాన్ని ప్రారంభించాలి. ఓపెనర్లు తొందరగా పరుగులు తీయకుండా.. బంతి పాతబడే వరకు నిల దొక్కుకొని.. ఆ తర్వాత దూకుడు కొనసాగించాల్సి ఉంది. సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియాకు గొప్ప రికార్డు లేదు. 13 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం ఒకే ఒకసారి విజయం సాధించింది. 1978లో బిషన్ సింగ్ బేడీ నాయకత్వంలో సిడ్నీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో విజయాన్ని నమోదు చేయలేదు. 1978లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను టీమిండియా రెండు పరుగుల తేడాతో ఓడించింది. నాడు ఆస్ట్రేలియాకు సింప్సన్ నాయకత్వం వహించాడు. ఈ మైదానంలో 2019, 2021లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడగా.. రెండుసార్లు కూడా మ్యాచ్ లు డ్రా అయ్యాయి.