Free Bus Effect: ఈ దక్షిణాది రాష్ట్రం అయిన కర్ణాటకలో బస్సు ప్రయాణం ఖరీదైనదిగా మారింది. జనవరి 2న ప్రభుత్వ బస్సు ఛార్జీలను 15 శాతం పెంచుతూ కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో కర్ణాటకలో బస్సు ప్రయాణాలు త్వరలో ఖరీదైనవిగా మారనున్నాయి. న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ను ఉటంకిస్తూ పీటీఐ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆ రాష్ట్రంలో అమలువుతున్న ఫ్రీ బస్సు పథకం ‘శక్తి’ నాన్-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని హెచ్‌కే పాటిల్ తెలిపారు. రూ.2000 కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేశామని వెల్లడించారు. అయితే 13శాతం, 15శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ రేట్లను పరిశీలించి 15శాతం పెంచాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు.
బస్సు చార్జీలు పెంచడానికి కారణం ఏమిటి?
ఛార్జీల పెంపునకు గల కారణాన్ని న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ వివరిస్తూ.. ఇంధన ధరలు, ఉద్యోగులపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
9 ఏళ్ల క్రితం బస్సు చార్జీల పెంపు
2015 జనవరి 10న చివరిసారిగా డీజిల్ ధర లీటరుకు రూ.60.90 ఉండగా రాష్ట్ర రవాణా సంస్థల బస్సు చార్జీలను పెంచామని హెచ్‌కే పాటిల్ తెలిపారు. అప్పటి నుంచి డీజిల్ రేట్లు గణనీయంగా పెరగడంతో ఆ ప్రభావం బస్సుల నిర్వహణ ఖర్చుపైనా కనిపిస్తోంది.
ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది
బస్సు చార్జీల పెంపు పై న్యాయశాఖ మంత్రి హెచ్ కే పాటిల్ సమాధానం ఇస్తూ… ‘‘పదేళ్ల క్రితం నాలుగు కార్పొరేషన్ల రోజువారీ డీజిల్ వినియోగం రూ.9.16 కోట్లు కాగా, ఇప్పుడు రూ.13.21 కోట్లకు పెరిగిందని, ఈ నాలుగు కార్పొరేషన్ల ఉద్యోగుల రోజువారీ డీజిల్ వినియోగం సుమారు రూ. 12.95 కోట్లు ఖర్చవుతుండగా, ఇప్పుడు రోజుకు రూ.18.36 కోట్లకు పెరిగింది, అందుకే బస్ చార్జీల్లో సవరణ తప్పనిసరి, ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.’’ అన్నారు.
మరో నాలుగు రవాణా సంస్థల బస్సులలో ప్రయాణం కాస్ట్లీ
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నాలుగు రాష్ట్ర రవాణా సంస్థల బస్సు ఛార్జీలను కర్ణాటక క్యాబినెట్ పెంచింది. 15 శాతం పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి ?
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఐదు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దాదాపు రెండేళ్లుగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చింది. త్వరలో ఏపీలోనూ ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఇప్పటికే కీలక చర్చలు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంశం.. దాని పై తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు ఆరా తీశారు. ఫ్రీ బస్సు పథకం అమల్లో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని వారు సీఎంనకు సూచించారు. ఉగాది పండుగ నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో కూడా ఫ్రీ బస్సు కారణంగా ఎన్నో పొట్లాటలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే బస్సులు సరిపోక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో పథకం అందుబాటులో ఉంది. బస్సుల కొరత తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.