Ind Vs Aus 4th Test: పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో రెండవ ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (161), రాహుల్ (77) తొలి వికెట్ కు 201 పరుగులు నమోదు చేశారు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి వికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా కొనసాగుతోంది. అయితే వీరిద్దరూ నెలకొల్పిన ఆ భాగస్వామ్యం వల్ల టీమిండియా ఆస్ట్రేలియాపై ఏకంగా 295 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ ను రాహుల్, యశస్వి జైస్వాల్ జోడి రిపీట్ చేయలేకపోయింది. ఫలితంగా టీమిండియా విజయాలపై అది ప్రభావం చూపించింది. అయితే మళ్లీ ఇన్ని రోజులకు టీమిండియా ఆ స్థాయిలో ఆడింది. అలా ఆడింది ఏ రోహితో, విరాట్ కోహ్లీనో, రాహులో, జైస్వాలో కాదు.
అదరగొట్టారు
మెల్ బోర్న్ టెస్టులో వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయినప్పటికీ.. జట్టుకు ఎంతో ఉపయోగమైన పరుగులు చేశాడు. తనదైన డిఫెన్స్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి తోడ్పాటు అందిస్తూ.. జట్టును ఫాలో ఆన్ ఆడకుండా తన వంతు ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయినప్పటికీ.. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఎనిమిదో వికెట్ కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వాస్తవానికి నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఈ స్థాయిలో ఆడతారని ఎవరూ ఊహించలేదు. నితీష్ మీద అందరికీ అంచనాలు ఉన్నప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ మీద ఎవరికీ ఎటువంటి అభిప్రాయం లేదు. దీంతో టీం ఇండియా త్వరగానే ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మార్ష్, స్టార్క్, కమిన్స్, లయన్, బోలాండ్, హెడ్ వంటి బౌలర్ల బౌలింగ్లో ఎదుర్కొంటూ టీమిండియా కు గౌరవప్రద స్థానాన్ని అందించారు. వాస్తవానికి పెర్త్ టెస్టులో రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు రాహుల్, జైస్వాల్ మీద పెద్దగా ఒత్తిడి లేదు. ఎందుకంటే అప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా పై కొంత లీడ్ లో ఉంది. కానీ మెల్బోర్న్ మ్యాచ్లో అందుకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అప్పటికే 7 వికెట్లు పోయాయి. ఫాలో ఆన్ ప్రమాదం కళ్ళ ముందు ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఆడుతూ.. ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకుంటూ.. నిదానంగా పరుగులు చేసుకుంటూ.. ఇటుక ఇటుక పేర్చినట్టు బ్యాటింగ్ చేస్తూ.. ఆస్ట్రేలియాకు చేయాల్సిన నష్టం చేశారు నితీష్, సుందర్. ఒకవేళ సుందర్ కనుక అవుట్ అయ్యి ఉండకుండా ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదేమో.