Site icon OkTelugu

Tigers in AP: ఏపీని వీడని పులులు.. రంగంలోకి హనుమాన్ బృందాలు!

Tigers in AP

Tigers in AP

Tigers in AP: రాష్ట్రానికి వన్యప్రాణుల భయం వేయడం లేదు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ఇటీవల పెద్దపులుల సంచారం అధికం అయ్యింది. జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారింది. మూగజీవాల పై దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పెద్దపులి పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తూ కనిపించింది. దానిని అధికారులు గుర్తించారు. వెంటనే ప్రజలను అప్రమత్తం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ అధికారుల సైతం అప్రమత్తమయ్యారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి కదలికలను అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.

గోదావరి ప్రాంతాల్లో..
ఇటీవల రాజమండ్రి( Rajahmundry) పరిసర ప్రాంతాల్లో పులుల సంచారం అధికంగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న ఈ పెద్ద పులులు సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. మొన్న ఆ మధ్యన పెద్ద రిస్క్యూ ఆపరేషన్ చేసి ఓ పెద్ద పులిని బంధించారు. అది మరువక ముందే మరో పులి సంచారం కనిపించింది. అయితే అదే పులి రంపచోడవరం ప్రాంతానికి వెళ్లిందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే రంగంలోకి హనుమాన్ బృందాలు దిగాయి. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు కూడా రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో ఈ బృందం గాలిస్తోంది.

అధికారుల కీలక సూచనలు..
పులి సంచారం నేపథ్యంలో సోషల్ మీడియాలో( social media) కొన్ని రకాల పుకార్లు రేగుతున్నాయి. అందుకే అటవీశాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు స్థానికులకు. ఉదయం, సాయంత్రం సమయాల్లో అటవీ ప్రాంతాల వైపు ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు. పులిని దగ్గరగా చూడడం.. వెంట పడడం, ఫోటోలు తీయడం వంటివి చేయవద్దని సూచిస్తున్నారు. రాత్రి సమయంలో సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే పశువులను కట్టాలని.. అటవీ సమీప గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు ఒంటరిగా తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు పులి సంచర ప్రాంతాల్లో దండోరా వేయిస్తున్నారు. మొత్తానికి అయితే వన్యప్రాణుల తాకిడి ఏపీలో కొనసాగుతూనే ఉంది.

Exit mobile version