AP Investments: ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. పెట్టుబడుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా ఆదాయాన్ని ఇచ్చే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ఆకట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఏపీలోకి భారీగా పెట్టుబడులు వచ్చేలా వ్యూహం పన్నింది కూటమి సర్కార్. ఇటీవల ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పాలసీలను ప్రకటించింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రోత్సాహకాలను ప్రకటించింది కూటమి సర్కార్. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుమతులను సరళతరం చేసింది. భూ కేటాయింపులు, ఇతరత్రా రాయితీలను అందించేందుకు కూడా నిర్ణయించింది.
* ఆ రెండు నినాదాలతో
సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనే నినాదాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు వేగవంతంగా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గతంలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కానీ వాటన్నింటినీ సరళతరం చేసింది కూటమి సర్కార్. పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే వీలైనంత త్వరగా అనుమతుల మంజూరు, రాయితీల ప్రకటన వంటివి చేస్తోంది. దీంతో చాలామంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
* లోకేష్ చొరవతో
కొద్ది రోజుల కిందట మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. ఫాక్స్ కాన్, సాంసంగ్, హావెల్స్, డిగ్సన్ టెక్నాలజీ వంటి కంపెనీల సీఈఓ లతో చర్చలు కూడా జరిపింది. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం టాటా గ్రూప్ రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లను స్థాపించబోతోంది. మరోవైపు అర్సలార్ మిట్టల్ కంపెనీ లక్ష నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. సెరెండిటి గోల్డ్ కంపెనీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టబోతోంది. ఇలా ఏపీ పెట్టుబడుల స్వర్గధామం గా నిలుస్తోంది. మున్ముందు మరిన్ని కంపెనీలు ఏపీకి క్యూ కట్టే అవకాశం ఉంది.