WTC Final India Vs Australia: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం ఓవల వేదికగా ప్రారంభమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా దూకుడు కనబర్చింది. తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్(146), స్టీవ్ స్మిత్(95) క్రీజులో ఉన్నారు. పిచ్ పరిస్థితి చూస్తుంటే భారీగా స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ డ్రా, టై లేదా రద్దు అయితే ఏమవుతుంది.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయన్న చర్చ జరుగుతోంది.
ఐసీసీ రూల్స్ ఇలా..
ఐసీసీ రూల్స్ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా, టై లేదా రర్దు అయితే టీమిండియా, ఆస్ట్రేలియాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. పాయింట్ల టేబుల్, ఇతర నిబంధనలతో సంబంధం లేకుండా ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి. ఇక ఐదు రోజుల షెడ్యూల్‌లో ఏ ఒక్క రోజైన ఆటకు వర్షం వల్ల ఆటంకం కలిగితే.. జూన్ 12న రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ వర్షం లేకుండా 5 రోజుల ఆట సాఫీగా సాగితే.. రిజర్వ్ డే ఉండదు.
మొదటి రోజు ఆటలో బౌలర్ల విఫలం..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ టాస్ గెలిచాడు. ఓవల్ మైదానం పిచ్‌పై గడ్డి ఉండడం, వాతావరణం చల్లగా ఉండడంతో మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే బౌలర్లపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. మొదటి రోజు టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి సెషన్‌లో వికెట్లు తీసి.. జోష్ మీద ఉన్నప్పటికీ.. ఆ తర్వాత బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. వారి బ్యాటింగ్ లైనప్‌లో ఇంకా బ్యాటర్లు ఉండటంతో.. రెండో రోజు భారత్ బౌలర్లు ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. రెండో రోజు కూడా బౌలర్లు విఫలమైతే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడం ఖాయం. అప్పుడు భారత బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెరుగుతుంది. రెండో రోజు ఆస్ట్రేలియాను కట్టడి చేయకపోతే.. భారత్‌కు ఇబ్బందులు తప్పవని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
సహకరించని పిచ్..
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడానికి బౌలర్లు ఎంత శ్రమించినా పిచ్ నుంచి సహకారం రావడం లేదు. షమీ పదునైను బంతులు వేసినా, సిరాజ్ బుల్లెట్ లాంటి బంతులు విసిరినా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఇక స్పిన్నర్ జడేజా కూడా ప్రభావం చూపలేకపోయారు. అటు సీమర్లు, ఇటు స్పిన్నర్ తేలిపోవడంతో ఆస్ట్రేలియాదే తొలిరోజు పైచేయి అయింది.