ICC T20 World Cup 2024 : క్రికెట్ అంటే 22(రెండు జట్లు కలిపి) మంది ఆటగాళ్లు, ముగ్గురు ఎంపైర్లు, విస్తారమైన స్టేడియం, ఆరు వికెట్లు, రెండు బ్యాట్లు మాత్రమే.. ఇది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు క్రికెట్ స్వరూపం పూర్తిగా మారింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో మరింత ఆధునిక పోకడలు పోతోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు క్రికెట్లోకి ప్రవేశించడంతో.. కొత్త కొత్త విధానాలు తెరపైకి వస్తున్నాయి. దీనికి టెక్నాలజీ కూడా తోడు కావడంతో క్రికెట్ అనేది ఆటగానే కాకుండా, కాసులు కురిపించే యంత్రంలాగా మారిపోతుంది.
ఐపీఎల్ జరుగుతున్నప్పుడు “డ్రీమ్ – 11” పేరుతో ఒక యాడ్ తెగ చక్కర్లు కొడుతుంది. అప్పట్లో దాని గురించి చాలామందికి తెలిసేది కాదు. ఆ తర్వాత అది విశేషమైన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫలితంగా ఆ సంస్థను స్థాపించిన హర్ష్ జైన్ కు కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ తీసుకొస్తూనే ఉంది.. ఈ సంస్థ ఏకంగా టీమిండియా కు కొత్త స్పాన్సర్ గా ఎంపికైంది. గతంలో బైజూస్ ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని డ్రీమ్ -11 ఆక్రమించింది. ఈ స్పాన్సర్ హక్కుల కోసం డ్రీమ్ -11 ఏకంగా 358 కోట్లు ఖర్చు పెట్టింది.
డ్రీమ్ -11 అనేది ఒక ఫాంటసీ స్పోర్ట్స్. అంటే వ్యూహ ఆధారిత ఆన్ లైన్ స్పోర్ట్స్ గేమ్. దీని ప్రకారం లైవ్ మ్యాచ్ లలో మీరు ఆడే అవకాశం ఉంటుంది. నిజమైన ఆటగాళ్లతో ఒక వర్చువల్ టీమ్ ను సృష్టించుకోవచ్చు. వాస్తవ మ్యాచ్ ల లాగానే నచ్చిన ఆటగాళ్లతో ఫాంటసీ క్రికెట్ ఆడిస్తూ పాయింట్లు పొందవచ్చు. ఈ పొందిన పాయింట్లు ఆధారంగా నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఫుట్ బాల్, వాలీబాల్, బాక్సింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో కూడా ఫాంటసీ గేమ్ ఆడే అవకాశం డ్రీమ్ -11 కల్పిస్తోంది. డ్రీమ్ -11 లో ఇష్టమైన క్రీడను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత ఇష్టమైన టీమ్ ను సృష్టించుకోవాలి. పబ్లిక్ లేదా ప్రైవేట్ హెడ్ టు హెడ్ పోటీలలో పాల్గొనాలి. అలా పాల్గొనాలంటే నిర్ణీత ప్రవేశ మొత్తాన్ని చెల్లించాలి.
ఇతర జట్లతో పోటీపడే ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్లలో పాల్గొనే అవకాశం కూడా డ్రీమ్ -11 కల్పిస్తోంది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఇది బెట్టింగ్ లాగానే కనిపించవచ్చు. కానీ, ఇది ఫాంటసీ గేమ్. ఇందులో ఆడాలంటే నిర్ణిత మొత్తంలోనే ప్రవేశ రుసుం ఉంటుంది. ఇందులో ప్రతి రూపాయి చెల్లింపు కూడా న్యాయబద్ధంగా జరుగుతూ ఉంటుంది. బెట్టింగ్ సంస్కృతిని రూపుమాపేందుకే దీనిని తెరపైకి తీసుకొచ్చామని డ్రీమ్ -11 వ్యవస్థాపకులు అంటున్నారు. డ్రీమ్ -11 ఐపీఎల్ సీజన్ లలో విజయవంతమైన నేపథ్యంలో.. ఈ వ్యాపార కిటుకును టీ 20 వరల్డ్ కప్ లో అమలు చేయాలని ఐసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే కీలక ప్రకటన చేసింది.
త్వరలో అమెరికా – వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఫాంటసీ క్రికెట్ ను ఐసీసీ తెరపైకి తీసుకువచ్చింది. “ఫ్యాన్ క్రేజ్” అనే సంస్థ “క్రిక్టోస్” అనే యాప్ ద్వారా ఈ ఫాంటసీ క్రికెట్ ను నిర్వహించనుంది. డ్రీమ్ -11 లో వర్చువల్ రియాల్టీ క్రికెట్ ఎలాగైతే ఆడతారో.. అలాగే ఫ్యాన్ క్రేజ్ యాప్ క్రిక్టోస్ లోనూ ఆడొచ్చు.. డ్రీమ్ -11 అన్ని క్రీడల్లో ఈ అవకాశాన్ని కల్పిస్తుండగా.. ఫ్యాన్ క్రేజ్ తన “క్రిక్టోస్” లో కేవలం క్రికెట్లో మాత్రమే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ దీనిని తెగ ప్రమోట్ చేస్తోంది. ” పురుషుల టి20 ప్రపంచ కప్ త్వరలో ప్రారంభం కానుంది. గత 15 సంవత్సరాలుగా అనేక ఉద్విగ్నమైన క్షణాలను, అద్భుతమైన గేమ్ లను టి20 వరల్డ్ కప్ అందించింది. అలాంటి అనుభూతులను ప్రేక్షకులకు అందించేందుకు మేము ఫ్యాన్ క్రేజ్ ఆధ్వర్యంలో క్రిక్టోస్ అనే యాప్ ను తెరపైకి తీసుకొచ్చామని” ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అన్శుమ్ బాంబ్రీ పేర్కొన్నారు.. “ఫాంటసీ క్రికెట్ ఆడాలనుకునేవారు “ఐసీసీ క్రిక్టోస్ యాప్” ను ఉపయోగించి.. వాస్తవ ఆధారిత క్రికెట్ టీం ను సృష్టించవచ్చు. ఇది సరికొత్త డిజిటల్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. వందకు పైగా దేశాలలో క్రికెట్ కు అభిమానులు ఉన్న నేపథ్యంలో.. ఇది కచ్చితంగా విజయవంతమవుతుందని” ఐసీసీ డిజిటల్ హెడ్ ఫిన్ బ్రాడ్ షా పేర్కొన్నారు.. ఈ పోటీలలో పాల్గొని, విజేతలయిన వారికి అద్భుతమైన బహుమతులు అందిస్తామని ఫ్యాన్ క్రేజ్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇందులో ప్రవేశ రుసుం ఎంతనేది వారు ప్రకటించలేదు. ఐసీసీ, ఫ్యాన్ క్రేజ్ ఆధ్వర్యంలో.. క్రిక్టోస్ యాప్ ను రూపొందించడం విశేషం. డ్రీమ్ -11 మాదిరిగానే క్రిక్టోస్ యాప్ ను విస్తృతం చేసే పనిలో ఐసీసీ నిమగ్నమై ఉంది. ఈ యాప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 60:40 నిష్పత్తిలో ఐసీసీ, ఫ్యాన్ క్రేజ్ పంచుకుంటాయని తెలుస్తోంది.