SRH Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం కోల్ కతా జట్టు తో చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ లో విఫలమై.. బౌలింగ్ లో చేతులెత్తేసి.. 8 వికెట్ల తేడాతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరు పట్ల.. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో.. ఆ టీం యజమాని కావ్య మారన్ కంట నీరు పెట్టుకుంది. బయటికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కోల్ కతా ఆటగాళ్లను అభినందించింది. టైటిల్ చేజారడంతో నిర్వేదంలో మునిగిపోయింది. మిగతా ఏ జట్టు ఓనర్ అయినా ఇలాంటి పరిస్థితిలో ఉంటే కచ్చితంగా బయటికి వచ్చేవారు కాదు. పైగా ఆటగాళ్లకు క్లాస్ తీసుకునేవారు. అక్కడిదాకా ఎందుకు ఇటీవల లీగ్ మ్యాచ్ లో లక్నో పై హైదరాబాద్ పది వికెట్ల తేడాతో గెలిస్తే.. ఆ జట్టు యజమాని సంజీవ్.. కెప్టెన్ రాహుల్ పై ఏ స్థాయిలో చిటపటలాడాడో అందరూ చూశారు. కానీ, ఫైనల్ మ్యాచ్లో ఓడినప్పటికీ కావ్య తన జట్టు ఆటగాళ్లను కించిత్ మాట కూడా అనలేదు. పైగా ఈ టోర్నీలో తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు అంటూ ఆమె కితాబిచ్చింది.
కోల్ కతా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత.. కావ్య సన్ రైజర్స్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది. పేరుపేరునా ప్రతి ఆటగాడికి ధన్యవాదాలు తెలియజేసింది. ” కప్ గెలవలేదని బాధ వద్దు. దూకుడుగా ఆడారు. టి20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాలను లిఖించారు. ఆరెంజ్ సైన్యం గల్లా ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించారు. ఈ విషయం మీకు చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరూ మన గురించి మాట్లాడుకునే విధంగా మీరు చేశారు. అదృష్టం బాగోలేదు కాబట్టి ఈరోజు మనకు కలిసి రాలేదు. మీరు మాత్రం అనితరసాధ్యమైన ఆట తీరు ప్రదర్శించారు. బ్యాట్, బంతితో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వేలాదిగా అభిమానులు స్టేడియాలకు పోటెత్తారంటే దానికి కారణం మీరే.. ప్రతి ఒక్కరూ మీ ఆట తీరు గురించి మాట్లాడారు..కోల్ కతా టైటిల్ గెలిచినప్పటికీ.. ఇప్పటికీ మీరు ఆడిన విధానం గురించే చర్చించుకుంటున్నారని” కావ్య ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
కావ్య మారన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కావ్య ను ప్రశంసిస్తున్నారు. ఓనర్ అంటే ఇలా ఉండాలి అంటూ అభినందిస్తున్నారు. మిగతా జట్ల యజమానులు కూడా కావ్యను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.
"You've made us proud."
– Kaviya Maran pic.twitter.com/zMZraivXEE
— SunRisers Hyderabad (@SunRisers) May 27, 2024