https://oktelugu.com/

Women T20 World Cup: నిన్న టి20 కప్ ప్రైజ్ మనీ పెంపు.. నేడు ఏడాదికో మెగా టోర్నీ.. మహిళల క్రికెట్ కు మంచి రోజులు

మహిళల క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్టే. మొన్నటిదాకా క్రికెట్ అంటే పురుషులదే అన్నట్టుగా ఉండేది. కొద్దిరోజులుగా ఐసీసీ వ్యవహార శైలి కూడా మారుతుంది. పక్షపాత వైఖరిని పక్కనపెట్టి ఆడవాళ్ళ క్రికెట్ లో సమూల మార్పులు తీసుకొస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 5, 2024 / 05:09 PM IST

    Women T20 World Cup(2)

    Follow us on

    Women T20 World Cup: ఇటీవల జరిగిన మహిళల టి20 వరల్డ్ కప్ లో ప్రైజ్ మనీని ఐసీసీ పెంచింది. పురుషులతో సమానంగా చేసింది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. పురుషుల క్రికెట్ మాదిరిగానే ఇకపై ప్రతి ఏడాది మహిళల క్రికెట్ లో భారీ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా 2025 – 2029 ఉమెన్స్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్ టీ పీ) షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాలలో రెండు వన్డే ప్రపంచ కప్ లు(2025, 2029), రెండు టి20 ప్రపంచ కప్ లు(2026, 2028) తో పాటుగానే 2027 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనుంది. 2027 జూన్ – జూలై నెలలో ఆరు జట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనుంది. దీనికి శ్రీలంక ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీ టి20 తరహాలో జరుగుతుంది.. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ లోనూ మహిళల క్రికెట్ ఒక భాగం కానుంది. మొత్తంగా చూస్తే ఈ ఫార్మాట్లలో 400 మ్యాచ్ లను ఐసీసీ నిర్వహించనుంది..

    ఛాంపియన్స్ ట్రోఫీ విధివిధానాలు ఇలా

    శ్రీలంక వేదికగా 2027లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ని జూన్ జూలై నెల మధ్యలో నిర్వహిస్తారు. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. వాటి మధ్య 16 మ్యాచ్ లు జరుగుతాయి. తొలి సీజన్లో తలపడే 6 జట్ల వివరాలను ఐసీసీ ఇంకా వెల్లడించలేదు. టి20 ర్యాంకులు ఆధారంగా, క్వాలిఫైయింగ్ మ్యాచ్ లను పరిగణనలోకి తీసుకొని జట్లను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. మెగా టోర్నీ ప్రారంభం, ఫైనల్స్.. ఇతర వివరాలను త్వరలోనే ఐసీసీ వెల్లడించనుంది.

    స్వదేశంలో భారత జట్టు విషయానికొస్తే..

    ఇక స్వదేశంలో భారత జట్టు విషయానికొస్తే వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వే తో సిరీస్ లు ఆడనుంది. ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ దేశాలలో పర్యటించనుంది. కొత్త షెడ్యూల్ ను ఐసీసీ వెల్లడించిన నేపథ్యంలో 2026 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ జనవరి నుంచే ప్రారంభమవుతుంది. ఆ ప్రకారం టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే బీసీసీఐకి ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.. మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని తర్వాత స్థాయికి తీసుకెళ్లాలని ఐసీసీ భావిస్తోంది. అందువల్లే గ్యాప్ లేకుండా మెగా టోర్నీలు నిర్వహిస్తోంది. వచ్చే రోజుల్లో దేశవాళీ టోర్నీలు కూడా నిర్వహించేలాగా జట్లు ఏర్పాట్లు చేసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఇప్పటికే క్రికెట్ ఆడే దేశాలకు ఆదేశాలు ఇచ్చింది.