Ind Vs Nz Final Champions Trophy: “ఆస్ట్రేలియాతో ఎంతలా ఇబ్బంది ఉంటుందో.. న్యూజిలాండ్ తో టీమిండియా కు అదే స్థాయిలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. ఆటగాళ్లు చూసుకొని ఆడాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత అనుకుంటే ఉపయోగం ఉండదు. ప్రణాళికలు మాత్రమే కాదు అప్పటికప్పుడు చాకచక్యాన్ని కూడా ఆటగాళ్లు ప్రదర్శించాలి. మైదానంలో ప్రతి పరిస్థితిని కనిపెట్టుకొని ఉండాలి” న్యూజిలాండ్ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ అడుగుపెట్టిన సందర్భంలో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు అవి. రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఊకదంపుడు మాటలు కావు. గాలి వ్యాఖ్యలు అంతకన్నా కావు.
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు కోలు కోలేని షాక్..
సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కెన్యా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏకంగా 264 పరుగులు చేసింది. గంగూలీ 117 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 69 పరుగులు చేశాడు. చేదన మొదలుపెట్టిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్లు అనిల్ కుంబ్లే 2/55, వెంకటేష్ ప్రసాద్ 3/27 ధాటికి న్యూజిలాండ్ 132 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. విజయం సాధించాలంటే మరో నోటంపై పరుగులు చేయాల్సిన సమయంలో క్రిస్ క్రెయిన్స్ 102*, క్రిస్ హారిస్ 46 అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.
ఇక 2019 వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరుకున్న టీం ఇండియాను న్యూజిలాండ్ జట్టు ఓడించింది. భారత ముందు 239 పరుగుల టార్గెట్ విధించిన న్యూజిలాండ్ జట్టు.. రోహిత్, రాహుల్, కోహ్లీని ఒక్క పరుగుకే అవుట్ చేసింది. రవీంద్ర జడేజా 77, మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులతో పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది . ఈ మ్యాచ్లో 49 ఓవర్లో ధోనిని న్యూజిలాండ్ రనౌట్ చేసింది. అంతేకాదు అతని కెరియర్ ముగియడానికి ఓ కారణమైంది.
2019 -21 కాలంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. 2021 మార్చి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. భారత జట్టుతో పోల్చి చూసుకుంటే న్యూజిలాండ్ అంత బలమైనది కాదు . ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరిగింది లండన్లో. అయినప్పటికీ భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ జట్టు షాక్ ఇచ్చింది. ఇక గత ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలలో టీమిండియా ను సొంత గడ్డపై 0-3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. భారతదేశాన్ని స్వదేశంలో క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇవన్నీ చూసుకుంటే ఆ న్యూజిలాండ్ జట్టు భారత్ కు పక్కలో బల్లెం లాంటిది. తేనె పూసిన కత్తిలాంటిది అందువల్లే భారత జట్టు న్యూజిలాండ్ తో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో మేటి బౌలర్లు, మేటి బ్యాటర్లు, మేటి ఫీల్డర్లు ఉన్నారు.