https://oktelugu.com/

India Vs Aus Semi Final: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్.. కంగారు ఈసారి మనకు కాదు వాళ్లకు.. ఎందుకంటే?

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండులోనే అయినప్పటికీ.. క్రికెట్ మొత్తాన్ని శాసిస్తోంది ఆస్ట్రేలియా జట్టే.. టెస్ట్, వన్డే, టి20.. ఏ ఫార్మాట్ అయినా ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొడతారు. సమష్టి ప్రదర్శనతో విజయం సాధిస్తారు. అందువల్లే ఆస్ట్రేలియా జట్టు అంటే క్రికెట్ లో మిగతా జట్టు భయపడుతుంటాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందే మానసికంగా ఓటమికి సిద్ధమవుతాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 3, 2025 / 10:06 AM IST
    India Vs Aus Semi Final

    India Vs Aus Semi Final

    Follow us on

    India Vs Aus Semi Final: శత్రు దుర్వేద్యమైన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కీలకమైన ఆటగాళ్లు ఇప్పటికే స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ జట్టుకు దూరమయ్యారు. వీరు ముగ్గురు అత్యంత ప్రమాదకరమైన బౌలర్లు. ముఖ్యంగా కమిన్స్ అయితే ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొడతాడు. ప్రత్యర్థి జట్టకు చుక్కలు చూపిస్తాడు. వీరు ముగ్గురు తీవ్రంగా గాయాల బారిన పడటంతో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుస విజయాలతో గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా తో భారత్ తలపడనుంది. మంగళవారం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే దీనికంటే ముందు ఆస్ట్రేలియా కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టాప్ ఆటగాడు ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. దీంతో అతడు సెమీఫైనల్ మ్యాచ్ ఆడకపోవచ్చని తెలుస్తోంది.

    Also Read: టీమిండియా గెలిచింది.. దక్షిణాఫ్రికాకు రిలీఫ్.. న్యూజిలాండ్ కు దురాభారం..

    ఇది భారత జట్టుకు లాభించే అంశం. 2023లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ట్రావిస్ హెడ్. అతడు భీకరమైన బ్యాటింగ్ చేయడంతో భారత్ ఓడిపోక తప్పలేదు. అయితే దీనికి భారత్ టి20 వరల్డ్ కప్ లో బదులు తీర్చుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎదురైన ఓటమికి భారత్ ఇప్పుడు బదులు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే అతడు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. తనది కాని రోజు కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేసే నేర్పరితనం హెడ్ ది. మరోవైపు ఇటీవల ఇంగ్లాండు జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో 350 పరుగుల స్కోరును కూడా ఆస్ట్రేలియా ఛేదించింది. ఆ మ్యాచ్లో హెడ్ దారుణంగా విఫలమైనప్పటికీ.. స్మిత్ మధ్యలోనే చేతులెత్తిసినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. అదరగొట్టే బ్యాటింగ్ తో జట్టును గెలిపించారు.

    ఇక చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మూడు మ్యాచ్ లలో విజయాలను సొంతం చేసుకుంది. ప్రత్యర్థులను మట్టికరిపించి గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. పాకిస్తాన్ జట్టుపై కూడా ఆరు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ పై లో స్కోర్ నమోదైన మ్యాచ్ లోనూ భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.. గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తో భారత్ మంగళవారం దుబాయ్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. నాకౌట్ విధానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్ కు పాకిస్తాన్ వెళ్లడం ఇష్టం లేకపోవడం వల్ల.. దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడ్ లో ఐసీసీ మ్యాచులు నిర్వహిస్తోంది. మంగళవారం తొలి సెమీఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియా దుబాయ్ వేదికగా తలపడతాయి. రెండు జట్లు అత్యంత బలమైనవి కావడంతో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అదేవిధమైన సంకేతాలు ఇచ్చాడు. కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేమని రోహిత్ పేర్కొన్నాడు. వరుస విజయాలు సాధించి సెమీఫైనల్ వచ్చామని.. సెమీఫైనల్ మ్యాచ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తామని రోహిత్ పేర్కొన్నాడు. స్పిన్ బౌలర్లు ఆకట్టుకుంటున్నాడని.. సెమీఫైనల్ మ్యాచ్ లోనూ వారు అదే విధమైన ప్రదర్శన కొనసాగిస్తారని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

     

    Also Read: తొలి ఓవర్ లో 8 పరుగులు ఇచ్చాడు.. ఆ తర్వాతే చుక్కలు చూపించాడు.. అదీ వరుణ్ చక్రవర్తి అంటే..