IND Vs NZ Champions Trophy 2025
IND Vs NZ Champions Trophy 2025: ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా t20 సిరీస్ ఆడినప్పుడు.. వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో కోల్ కతా జట్టు తరఫున మెరిసిన ఈ స్పిన్ బౌలర్.. చాలా రోజుల తర్వాత టీమిండియాలో స్థానం సంపాదించుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా దుమ్ము రేపాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో తనదైన మ్యాజికల్ డెలివరీలను అందిస్తూ ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా గడ్డపై బెంబేలెత్తించాడు.. టీమిండియాలో కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా హవా నడుస్తున్న క్రమంలో.. తాను ప్రత్యామ్నాయంగా ఉన్నానని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలనని నిరూపించాడు. అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం లభించింది. తొలి రెండు మ్యాచ్లలో వరుణ్ చక్రవర్తి రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. బహుశా ప్రయోగాలు వద్దనుకొని టీమిండియా మేనేజ్మెంట్ ఆ పని చేసింది కావచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. హర్షిత్ రాణాకు విశ్రాంతి ఇచ్చి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది. అతడు వచ్చిన అవకాశాన్ని నూటికి వేయి శాతం సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. గ్రూప్ ఏ లో టీమిండియా టాప్ స్థానంలో నిలబడేందుకు తన వంతు కృషి చేశాడు.
Also Read: తెలుగు క్రికెటర్లకు కాసుల పంట.. అభిమానులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్..
దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన లో స్కోర్ మ్యాచ్లో భారత జట్టును 44 పరుగుల తేడాతో గెలుపొందించడంలో వరుణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్లకు 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మైదానాన్ని అంచనా వేసి బౌలింగ్ తీసుకున్నాడు. కానీ అతడి నిర్ణయం తప్పని భారత బౌలర్లు నిరూపించారు. బంతి అనూహ్యంగా టర్న్ అవుతున్న ఈ మైదానంపై భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 79, అక్షర పటేల్ 42, హార్దిక్ పాండ్యా 45 పరుగులతో అదరగొట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీశాడు. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ పడగొట్టారు.
250 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు వరుణ్ చక్రవర్తి చుక్కలు చూపించాడు.. అతడి దూకుడు వల్ల న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకు అలౌట్ అయింది. న్యూజిలాండ్ లో కేన్ విలియంసన్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. తన మీద ఎటువంటి అంచనాలు లేకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత అసలు ఆట మొదలుపెట్టాడు. తన బౌలింగ్లో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించాడు. 5/42 గణాంకాలు నమోదు చేశాడు.. కులదీప్ యాదవ్ 2/56 తో అదరగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు.
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టుపై ఐదు వికెట్లు తీయడం ద్వారా వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనతను అందుకున్నాడు. తన కెరియర్లో రెండవ వన్డేలోనే ఈ రికార్డు సృష్టించిన తొలి భారతీయ బౌలర్ గా నిలిచాడు. 2014లో స్టువర్ట్ బిన్నీ తన మూడవ ఉండే లో బంగ్లాదేశ్ జట్టుపై ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ లో ఒక ఇన్నింగ్స్ లో స్పిన్నర్లు 9 వికెట్లు తీయడం విశేషం. వరుణ్ చక్రవర్తి అయిదు, కులదీప్ 2, అక్షర పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీయడం విశేషం. 2004లో కెన్యా జట్టుతో జరిగిన మ్యాచ్లో పాక్ స్పిన్నర్లు 8 వికెట్లు తీయడం విశేషం.
Also Read: ఇదే జరిగితే సెమీ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్