Rohit Sharma : ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చూపించింది.. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్లో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సిద్ధం చేసుకుంది. వాస్తవానికి బంగ్లాదేశ్ 100 పరుగుల లోపే కుప్పకూలాల్సి ఉంది.. అయితే హృదయ్, జాకీర్ అలీ ఆరో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా బంగ్లాదేశ్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. వాస్తవానికి జాకీర్ అలీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవాల్సి ఉంది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో బంతి జాకీర్ అలీ బ్యాట్ అంచుకు తగిలి స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది. సులువైన క్యాచ్ పట్టుకున్న రోహిత్.. ఆ తర్వాత దానిని జారవిడిచాడు.. దీంతో జాకీర్ అలీకి లైఫ్ లభించింది. ఫలితంగా అతడు క్రీజ్ లో పాతుకుపోయాడు. మరో ఆటగాడు హృదయ్ ఏకంగా సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ కనక జాకీర్ అలీ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి ఇంకో విధంగా ఉండేది.. అప్పటికే అక్షర్ పటేల్ 2 వికెట్లను వెంటవెంటనే పడగొట్టాడు. మూడో బంతిని అదేవిధంగా వేశాడు.. బంతి గమనాన్ని తప్పుగా అంచనా వేసిన జాకీర్ ఆలీ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కాకపోతే ఆ బంతి బ్యాట్ అంచుకు తగిలి రోహిత్ శర్మ చేతిలో పడింది. సులువైన క్యాచ్ అయినప్పటికీ రోహిత్ జార విడవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ దూరం చేశావని నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదురయ్యాయి.
ప్రాయశ్చిత్తం చేసుకుంటా
టీమిండియా బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. జట్టు విజయం గురించి గొప్పగా చెప్పాడు. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించారని కొనియాడాడు. ” మైదానంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మంచు కురుస్తున్నా కొద్దీ బంతి గమనం మారుతున్నది. అందువల్లే వికెట్లు పడిపోయాయి. ఏది ఏమైనప్పటికీ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఇదే జోరు వచ్చే మ్యాచ్ లలో కూడా కొనసాగిస్తాం. ఈ మ్యాచ్లో జాకీర్ అలీ ఇచ్చిన క్యాచ్ నేను పట్టి ఉండాల్సింది. ఆ సమయంలో అది నా చేతుల నుంచి జారిపోయింది. దానికి నా స్పందన ఏమిటో మైదానంలో చూపించాను. అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ దూరం చేశాను. కానీ దానికి ప్రయాశ్చిత్తం చేసుకుంటాను. అతడిని గురువారం డిన్నర్ కు తీసుకెళ్తాను. అతని మనసును కుదుటపరిచే పనిచేస్తానని” రోహిత్ వ్యాఖ్యానించాడు. రోహిత్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.. ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం రోహిత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.