Hardik Pandya: టీమిండియా సక్సెస్‌ సీక్రెట్‌ చెప్పిన హార్ధిక్ పాండ్యా.. ఆ రహస్యం ఏంటో తెలుసా?

మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది భారత జట్టు. ఈ క్రమంలోనే స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఇటీవల మాట్లాడుతూ టోర్నీలో తమ సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో చెప్పేశాడు. ప్రతీ మ్యాచ్‌ ఆడే ముందు జట్టులోని 11 మంది సభ్యులకు తమ చిన్ననాటి ఫొటోలను టీం మేనేజ్‌మెంట్‌ చూపిస్తోందట.

Written By: Gopi, Updated On : October 19, 2023 11:11 am

Hardik Pandya

Follow us on

Hardik Pandya: వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు మూడు లీగ్‌ మ్యాచ్‌లు ఆడేశాయి. కొన్ని నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఇండియా, న్యూజిలాడ్‌ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. మెరుగైన రన్‌రేట్‌తో దూసుకుపోతోంది. ఈ వరల్డ్‌ కప్‌లో మంచి జోరు మీదున్న జట్లలో టీమిండియా ఒకటి. మరోవైపు టీమిండియాలో అందరు ఆటగాళ్లు మంచి ఆటతీరు కనబరుస్తున్నారు. మొదటి మ్యాచులో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ భరిత విజయం సాధించిన భారత్‌.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ టీమ్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టీం సక్సెస్‌ మంత్ర ఏంటో వెల్లడించాడు హార్ధిక్‌ పాండ్యా.

ఆ చూడగానే ఆడేస్తున్నారట..
మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది భారత జట్టు. ఈ క్రమంలోనే స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఇటీవల మాట్లాడుతూ టోర్నీలో తమ సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో చెప్పేశాడు. ప్రతీ మ్యాచ్‌ ఆడే ముందు జట్టులోని 11 మంది సభ్యులకు తమ చిన్ననాటి ఫొటోలను టీం మేనేజ్‌మెంట్‌ చూపిస్తోందట. డ్రెస్సింగ్‌ రూం వాతావరణం చాలా సరదాగా ఉందని వెల్లడించాడు. ‘డ్రెస్సింగ్‌ రూంలో మా ప్లేయింగ్‌ ఎలెవన్‌ జట్టును చూపించే సమయంలో.. వాళ్ల చిన్ననాటి ఫొటోలు, గతంలోని ఫొటోలు, ఇప్పటి ఫొటోలు కలిపి చూపిస్తున్నారు. మా డ్రెస్సింగ్‌ రూం వాతావరణం చాలా సరదాగా, తేలికగా ఉంది. మేమంతా కలిసి ఒక జట్టులా ఆడుతున్నాం’ అని పాండ్యా వివరించాడు. అయితే ఈ టోర్నీలో పాండ్యాకు బ్యాటింగ్‌ చేసే అవకాశం పెద్దగా రాలేదు.

ఆసీస్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌..
ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచులో మాత్రమే పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చాడు. 8 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆఫ్ఘన్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. అదే సమయంలో బంతితో మాత్రం పాండ్యా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 6.56 ఎకానమీతో ఐదు వికెట్లు తీసుకున్నాడు.

నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌..
ఇక పూణే వేదికగా గురువారం భారత్‌ – బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచులో కూడా పాండ్యా ఇదే జోరు కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో భారత్‌ను బాగా ఇబ్బంది పెట్టిన జట్లలో బంగ్లా ముందు వరుసలో ఉంటుంది. ఆసియా కప్‌లో కూడా అన్ని జట్లను ఓడించిన భారత్‌.. బంగ్లాను మాత్రం ఓడించలేకపోయింది. మరి ఆ పరాజయానికి వరల్డ్‌ కప్‌లో పగ తీర్చుకుంటుందేమో చూడాలి.