AP Police: ఎమర్జెన్సీని తలపిస్తున్న ఏపీ.. అడుగడుగునా పోలీస్ యాక్ట్

పోలీసులు ఈ స్థాయికి దిగజారి పోవడానికి కారణం.. ముమ్మాటికి జగన్ సర్కారే. అసలు విపక్షాలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపకూడదన్నది వారి అభిమతం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ సెక్షన్ లను తెరపైకి తెచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Written By: Dharma, Updated On : October 19, 2023 3:25 pm

AP Police

Follow us on

AP Police: ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి. విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. నిత్యం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. అటు పోలీస్ యాక్ట్ 30 సైతం విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఎప్పుడూ వినని, చూడని కఠినమైన సెక్షన్లను తెరపైకి తెచ్చి అమలు చేస్తున్నారు. వాటినే న్యాయస్థానాలకు చూపి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో బాధితులు మరింత గా కృంగిపోతున్నారు. బాధితుడు తరపున ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు కూడా ఏపీలో వీలు లేకుండా పోతోంది.

విపక్ష నాయకులను ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో తెలియడం లేదు. పోలీసులు అసలు కారణమే చెప్పడం లేదు. టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన తల్లిదండ్రుల పితృ కార్యాలను చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించని దౌర్భాగ్య స్థితి ఏపీలో వెలుగు చూసింది. అసలు పోలీసులు ఇంత కఠినమైన ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది.రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటుండడం.. కొందరు అధికారులు ఏకపక్షంగా సహకరిస్తుండడంతో ఏపీ మొత్తం పోలీసు నిర్బంధంలోకి వెళ్లిపోయింది.

పోలీసులు ఈ స్థాయికి దిగజారి పోవడానికి కారణం.. ముమ్మాటికి జగన్ సర్కారే. అసలు విపక్షాలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపకూడదన్నది వారి అభిమతం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ సెక్షన్ లను తెరపైకి తెచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అడుగడుగున ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతున్నా.. ప్రజలను కాపాడేందుకు ఏ వ్యవస్థ కూడా ముందుకు రాలేని పరిస్థితి ఏపీలో దాపురించింది. జగన్ ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడలో పోలీస్ శాఖ పావుగా మారుతుండడం ఆందోళన కలిగించే విషయం.

గతంలో ఏ ప్రభుత్వమూ పోలీసులను, దర్యాప్తు సంస్థ సిఐడిని ప్రయోగించిన దాఖలాలు లేవు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడిన పరిస్థితి లేదు. చివరకు రాజశేఖర్ రెడ్డి సైతం విధానపరమైన యుద్ధమే చేశారు కానీ.. వ్యక్తిగతంగా ఏనాడు టార్గెట్ చేయలేదు. అలా చేసి ఉంటే చంద్రబాబు పై కేసులు నిలబడేవి కదా? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైతం ఎన్నెన్నో అవకతవకలు జరిగాయి. వాటికి బాధ్యులైన మంత్రులు వైసీపీలోనే ఉండేవారు. అయినా సరే చంద్రబాబు వాటి జోలికి పోలేదు. ఇప్పుడు పనిగొట్టుకొని పగ, ప్రతీకారంతో ఊగిపోతున్న జగన్ కు పోలీస్ శాఖ పావుగా పనిచేస్తోంది. రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థను తన జేబు సంస్థగా మార్చేశారు. ఇలానే కొనసాగితే రాష్ట్రం రావణకాష్టంగా మారడం.. పోలీసులపై ప్రజలు నమ్మకం కోల్పోవడం ఖాయం.