TDP Janasena Alliance: తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పవన్ వారాహి యాత్రలో టిడిపి, జనసేన జెండాలు రెపరెపలాడాయి.చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ నేరుగా వచ్చి పరామర్శించారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు.తక్షణం రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు.టిడిపి తో పొత్తు సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు.ఆయన అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం సమన్వయ కమిటీని ప్రకటించింది. ఈ తరుణంలోఈ రెండు కమిటీలు క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పటికే అంతర్గత సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు నాదెండ్ల మనోహర్, లోకేష్ తో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ తరుణంలో రెండు పార్టీల సమన్వయ కమిటీలు నేరుగా యాక్షన్ లోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం, జనసేన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రెండు పార్టీల శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి చేతులు కలిపాయి. టిడిపి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వైసీపీని గద్దె దించేందుకు రెండు పార్టీలు అంకితభావంతో పనిచేద్దామని, ఎటువంటి అరమరికలు లేకుండా ముందుకు సాగుదామని నేతలు ప్రతినబూనడం విశేషం.మరోవైపు జనసేన, టిడిపి సంయుక్తంగా త్వరలో ఉమ్మడి ప్రణాళికతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడతామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
అయితే రెండు పార్టీల మధ్య పొత్తుపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగారెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టింగులు, ట్రోల్స్ నడుపుతున్నారు. ఓట్లు, సీట్ల బదలాయింపు సక్రమంగా జరగకుండా అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది. ఈ తరుణంలో రెండు పార్టీల నాయకత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై స్పందించవద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాయి. ఎవరూ ఉద్రేకానికి గురి కావద్దని.. వైసీపీ ట్రాప్ లో పడొద్దని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ ఆదేశాలు వర్కౌట్ అయినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన శ్రేణులు మమేకమవుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆత్మీయ సమావేశాలు సైతం ప్రారంభమయ్యాయి.
మరోవైపు ఈ నెల 26 తర్వాత పవన్ వారాహి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మరోవైపు నారా భువనేశ్వరి సైతం ప్రజల్లోకి రానున్నారు. అటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో రెండు పార్టీల శ్రేణులు పాల్గొనే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రత్యేక వ్యూహంతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీల మధ్య ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని, ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాలని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభం కానుండడంతో వైసీపీ నేతల్లో గుబులు నెలకొంది.