Hardik Pandya: గత ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్లకు తన వైవిధ్య భరతమైన బంతులతో చుక్కలు చూపించాడు హార్దిక్ పాండ్యా. భీకరమైన ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్ ను బోల్తా కొట్టించి.. మ్యాచ్ ను భారత్ వైపు మొగ్గేలా చేశాడు. అంతేకాదు స్లాగ్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యాను నాటి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా ఆలింగనం చేసుకొని.. అభినందించాడు. ఆ విజయం తర్వాత కొద్ది రోజులకు.. హార్దిక్ పాండ్యా తన విడాకుల ప్రకటన చేశాడు. తన భార్య నటాషాతో విడిపోతున్నట్టు ప్రకటించాడు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని అభిమానులను కోరాడు.
తిరిగి ఇచ్చేస్తాను
ఇక ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతోంది. ఐదు టీ మ్యాచ్ ల సిరీస్ ను 3-1 తేడాతో ఇప్పటికే గెలుచుకుంది.. చివరిదైన ఐదో మ్యాచ్ ను ఆదివారం ఆడనుంది.. దీనికంటే ముందు పూణే వేదికగా జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ గెలుపులో హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శివం దుబే తో కలిసి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత అతడు విలేకరులతో మాట్లాడాడు..” నేనెప్పుడూ అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తాను. అభిమానులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను. ఆట నాకు చాలా ఇచ్చింది. ప్రేక్షకులు కూడా నన్ను అభిమానించారు. అభిమానిస్తూనే ఉన్నారు. వారందరూ ఎంతో కష్టపడి మైదానానికి వస్తుంటారు. మా ప్రదర్శన పట్ల వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారి ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని ఎప్పుడూ చెయ్యను. వారు నాకిచ్చిన దానికి.. తిరిగి ఇస్తూనే ఉంటాను. లేకపోతే లావైపోతానని”హార్దిక్ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. బంతి లేదా బ్యాట్ తో అదరగొడుతున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడు పాత్ర పోషిస్తున్నాడు. ఒంటి చేత్తో విజయాలు అందిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో తనదైన ఆటిట్యూడ్ షాట్ ఆడి సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాడు. అతడు భీకరమైన ఫామ్ లో ఉండడం వల్లే టీమిండియా మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసింది. తన ఎంపిక సబబే అని హార్దిక్ పాండ్యా నిరూపించాడు. పూణే మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి.. భారత జట్టును గెలిపించాడు.