https://oktelugu.com/

NAAC: లంచం ఇస్తే కాని పని అంటూ ఉంటుందా? చివరికి యూనివర్సిటీకి NACC రేటింగ్ కూడా.. ఇదీ మన వ్యవస్థ లేకితనం..

"లంచం ఇవ్వండయ్యా.. దాని వల్ల కాని పని అంటూ మన దేశంలో ఉండదు.." అతడు సినిమాలో సిబిఐ అధికారి ఆంజనేయ ప్రసాద్ తన సిబ్బందికి చేసే సూచన. ఆ సినిమాలో బ్యాంకులో పని కోసం సిబిఐ అధికారులు లంచాలు ఇస్తారు. అది చూసేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అది అంత విచిత్రంగా కనిపించదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 2, 2025 / 01:02 PM IST
    NAAC

    NAAC

    Follow us on

    NAAC: ఉదయాన్నే పేపర్ తిరిగేస్తుండగా.. ఈనాడులో కనిపించింది. ” NACC రేటింగ్ కోసం కేఎల్ యూనివర్సిటీ అడ్డదారులు తొక్కింది.. నాక్ అధికారులకు లంచాలు ఇవ్వచూపింది.. ఈ విషయం సిబిఐ అధికారులతో తెలియడంతో వారు రంగంలోకి దిగారు” ఇదీ ఆ వార్త సారాంశం. రేటింగ్ కోసం నాక్ అధికారులకు లంచాలు ఇవ్వచూపడం ఉత్తరాది రాష్ట్రాలలో యూనివర్సిటీలు చేస్తుంటాయి. దక్షిణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ఇందులో పోటీ పడుతున్నాయి. ఈ యూనివర్సిటీలు నిర్వహించే వారికి రాజకీయ నేపథ్యం ఉండడం.. రాజకీయాలలో వారు ప్రత్యక్ష సంబంధాన్ని కొనసాగించడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.. ప్రభుత్వ భూములను ఆక్రమించడం.. చివరికి చెరువులను సైతం వదిలి పెట్టకపోవడం.. అడ్డగోలుగా భవనాలు నిర్మించి విద్యా వ్యాపారం చేయడం.. ప్రభుత్వాలు కూడా వీరికి సహకరించడంతో.. వ్యవస్థ వీరిని ఏమీ చేయలేకపోతోంది. కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది మాత్రమే.. రాని సంఘటనలు చాలానే ఉన్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండానే యూనివర్సిటీలు నిర్వహిస్తున్న వీరు.. నాక్ అధికారులను మచ్చిక చేసుకోవడానికి ఎన్నో మోసాలు చేస్తున్నారు..

    బంగారు నాణాలు, నగదు ఇచ్చారట

    గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలో కేఎల్ ఈ ఎఫ్ యూనివర్సిటీ కొనసాగుతోంది. దీనికి రేటింగ్ కోసం నాక్ అధికారులకు ముడుపులు ఇచ్చారట. నాక్ పరిశీలన బృందానికి బంగారు నాణాలు, నగదు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు లంచం గా ఇచ్చారట. ఈ విషయం సిబిఐ అధికారులకు తెలియడంతో దేశవ్యాప్తంగా 20చోట్ల సోదాలు నిర్వహించిందట. ఈ సోదాలలో 37 లక్షల నగదు, 6 లాప్ టాప్ లు, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారట. కే ఎల్ ఈ ఎఫ్ యూనివర్సిటీ చెందిన జెపి సారధి వర్మ, కోనేరు రాజా, రామకృష్ణ, నాక్ పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్, పలువురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారట.. ఇలాంటి తప్పుడు రేటింగ్స్ తెచ్చుకొని.. లేనిపోని ప్రచారం చేసి.. విద్యార్థుల దగ్గర కేఎల్ యూనివర్సిటీ లక్షలలో ఫీజులు వసూలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విద్యా వ్యాపారం కావడంతో..నాక్ అధికారులకు లంచాలు ఇవ్వచూపిందని.. సిబిఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. గతంలో ఈ యూనివర్సిటీ పై చాలావరకు ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ యాజమాన్యం వాటిని అత్యంత సమర్థవంతంగా తొక్కి పెట్టింది. మరి ఇప్పుడు సిబిఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.