Hardik Pandya: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టుకు.. ఈ సీజన్ కూడా అంతగా కలిసి రావడం లేదు. వరుస ఓటములతో ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లక్నో జట్టుపై ఓటమిపాలైంది. దీంతో ముంబై అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. ఆ జట్టు ఆటగాళ్లు కూడా నిర్వేదంలో మునిగిపోయారు. ఈ సీజన్లో ఏడు ఓటములు ఎదుర్కొన్న ముంబై జట్టు.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ ఓటముల బాధ నుంచి తేరుకోకముందే, ముంబై జట్టు కెప్టెన్ కు ఐపీఎల్ నిర్వాహక కమిటీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మంగళవారం రాత్రి లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఓటమిపాలైంది. వాస్తవానికి ఈ మ్యాచ్ గెలిస్తేనే ముంబై జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు ఎంతో కొంత ఉండేవి. కానీ, గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ముంబై జట్టు ఓడిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో ముంబై జట్టు అత్యంత నాసిరకమైన ఆట తీరు ప్రదర్శించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై జట్టు స్లో ఓవర్ రేటు కొనసాగించింది. దీంతో ఐపీఎల్ నిర్వాహక కమిటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జట్టులోని ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. ఈ సీజన్లో ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కొనసాగించాడని ఐపీఎల్ నిర్వాహక కమిటీ హార్దిక్ పాండ్యాను ఓ సారి హెచ్చరించింది. మరోసారి ఈ తప్పు జరగకూడదని సూచించింది. అయినప్పటికీ, హార్దిక్ పాండ్యా తన తీరు మార్చుకోలేదు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కొనసాగించి ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు అతడి మ్యాచ్ ఫీజులో 24 లక్షల కోతకు గురయ్యాడు. మిగతా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఆరు లక్షల చొప్పున కోతకు గురయ్యారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో జట్టు.. ముంబై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై 144 రన్స్ కే పరిమితమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా డక్ ఔట్ అయ్యాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లు కూడా గొప్ప ప్రదర్శన చేయలేదు.. ఇక ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన హార్థిక్ పాండ్యా కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడి ఎకానమీ రేటు 11 కు పెరిగింది. మరోవైపు బ్యాటింగ్ లో కూడా హార్దిక్ పాండ్యా ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. 150.38 స్ట్రైక్ రేట్ తో 197 రన్స్ మాత్రమే చేశాడు. ముంబై జట్టు ఏరికోరి తీసుకొచ్చినందుకు.. హార్దిక్ పాండ్యా ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. చివరికి కెప్టెన్సీ విషయంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నాడు. ఫలితంగా ముంబై జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్ కు వెళ్లకుండానే, లీగ్ దశలోనే ఇంటి దారి పట్టే ప్రమాదం నెలకొంది.