https://oktelugu.com/

Bomb Threats: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

పాఠశాలలకు వచ్చిన ఈ మెయిల్స్ లో ఖురాన్ శ్లోకాలు ఉన్నాయి. బాంబు బెదిరింపుల మెయిల్స్ నేపథ్యంలో బుధవారం ఉదయం ఢిల్లీ ఫైల్ సర్వీసెస్ కు 60 కి పైగా కాల్స్ వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 1, 2024 / 04:19 PM IST

    Bomb Threats

    Follow us on

    Bomb Threats: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నిర్వహిస్తున్నారు. పోలీసు బలగాలు అడుగడుగునా పహారా కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో బాంబు బెదిరింపుల కలకలం నెలకొంది. ఢిల్లీలోని ఎన్సీఆర్ లో పలు పాఠశాలలకు ఈ మెయిల్స్ ద్వారా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలల నుంచి ఇళ్లకు పంపించారు. ఢిల్లీ, నోయిడా లోని సుమారు 100 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపుల ఈమెయిల్స్ వచ్చాయి. బుధవారం పేలుళ్లకు పాల్పడతామని ఆ ఈ మెయిల్స్ లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తులు పేర్కొన్నారు. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. వారు ఈ మెయిల్స్ వచ్చిన పాఠశాలలకు వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులను బయటికి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్, ఇతర పరికరాలతో పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు.

    పాఠశాలలకు వచ్చిన ఈ మెయిల్స్ లో ఖురాన్ శ్లోకాలు ఉన్నాయి. బాంబు బెదిరింపుల మెయిల్స్ నేపథ్యంలో బుధవారం ఉదయం ఢిల్లీ ఫైల్ సర్వీసెస్ కు 60 కి పైగా కాల్స్ వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. “ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఆరు పాఠశాలలకు తెల్లవారుజామున నాలుగు గంటలకు బాంబు బెదిరింపుల పేరుతో ఈ మెయిల్స్ వచ్చాయి. మేము పాఠశాలను మొత్తం తనిఖీ చేశాం. పాఠశాలల ప్రాంగణాలను కూడా జల్లెడ పట్టాం. కానీ, ఇంతవరకు ఎటువంటి బాంబులు మాకు కనిపించలేదు. దక్షిణ ఢిల్లీలోని 15 పాఠశాలలకు కూడా ఒకే సమయంలో ఈ తరహా మెయిల్స్ వచ్చాయని” ఢిల్లీ సౌత్ వెస్ట్, దక్షిణ డీసీపీలు రోహిత్ మీనా, అంకిత్ చౌహన్ పేర్కొన్నారు.

    పాఠశాలలకు వచ్చిన ఈ మెయిల్స్ మొత్తం రష్యన్ ఐడీ నుంచి పంపించారని, సైబర్ డొమైన్ కూడా ప్రాక్సీ ఐడీ లాగా చూపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఈ మెయిల్స్ ను సైబర్ నిపుణులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో కూడా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెబుతున్న పోలీసులు.. వాటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. “పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. నోయిడాలోని సెక్టార్ 29 లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ద్వారా మాకు సమాచారం అందింది. మేము వెంటనే పాఠశాలకు చేరుకున్నాం. బీడీఎస్ బృందం, స్నీ ఫర్ డాగ్ బృందం, అగ్నిమాపక దళం, ఇతర సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పదమైన వస్తువులు మాకు కనిపించలేదు. బాంబులు కూడా లభించలేదు. ముందు జాగ్రత్త చర్యగా పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పాఠశాలను మా బృందాలు తనిఖీ చేస్తున్నాయని” ఢిల్లీ డీఐజీ శివహరి మీనా పేర్కొన్నారు. ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఢిల్లీలో ఒకసారిగా కలకలం నెలకొంది.