Harbhajan Singh: టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధించి ఫైనల్ దూసుకెళ్లింది టీం ఇండియా. శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో టైటిల్ కోసం పోటీ పడనుంది. గురువారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 68 పరుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57, సూర్య కుమార్ యాదవ్ 47, హార్దిక్ పాండ్యా 23, రవీంద్ర జడేజా 17 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 3, రషీద్, కరణ్, టాప్లీ, ఆర్చర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రూక్ 25, బట్లర్ 23 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయం నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. 2014 తర్వాత ఫైనల్ వెళ్లడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు. కులదీప్, అక్షర్ బౌలింగ్ ను ఆకాశానికి ఎత్తాడు.. సెమీస్ లో విజయం సాధించిన నేపథ్యంలో భారత్.. దక్షిణాఫ్రికా జట్టుతో టైటిల్ కోసం తలపడనుంది. శనివారం ఈ మ్యాచ్ జరుగుతుంది..
భారత్ విజయం సాధించిన నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతుండగా.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ తలా తోకా లేని వ్యాఖ్యలు చేశాడు.. “టి20 వరల్డ్ కప్ లో వేదికలు, మైదానాలు భారత జట్టుకు అనుకూలంగా ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలు నమ్మశక్యం కాని తీరుగా ఉన్నాయి. అన్ని వారికే అనుకూలంగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదని” వాన్ పేర్కొన్నాడు. వాన్ చేసిన వ్యాఖ్యలను భారత జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా పరిగణించాడు..” భారత జట్టుకు గయానా సరైన వేదికని మీరెందుకు అనుకుంటున్నారు. రెండు జట్లు కూడా అక్కడే ఆడాయి కదా.. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. ఇంగ్లాండ్ జట్టును భారత్ అన్ని విభాగాలలో ఓడించింది అని చెప్పాలి. అలాకాకుండా ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా.. ఏవేవో ఆరోపణలు చేస్తారేంటి. లాజిక్ తో మాట్లాడాలి. అంతేతప్ప చెత్త వాగుడు వాగొద్దంటూ” హర్భజన్ సింగ్ అన్నాడు. కాగా, ఇటీవల ఆస్ట్రేలియా జట్టుపై సూపర్ -8 మ్యాచ్లో గెలిచిన అనంతరం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్.. భారత జట్టు బౌలర్ అర్ష్ దీప్ సింగ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.