GT vs RCB : అది కీలకమైన మ్యాచ్. అందులో గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశాలుంటాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు స్థానం మారిపోతుంది. పైగా ఆ జట్టు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలో కప్ కొట్టేసింది. గత ఏడాది సీజన్లో రన్నరప్ గా నిలిచింది. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది… మేము చెబుతున్నది గుజరాత్ జట్టు గురించని.. ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించడంతో, ఆ జట్టుపై అందరికీ అంచనాల పెరిగిపోయాయి. ఆ తర్వాత నాసిరకమైన ఆటతీరుతో ఆ జట్టు అంతకంతకు దిగజారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో.. గుజరాత్ తేలిపోయింది.. శనివారం నాడు బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడి 19.3 ఓవర్లలో కేవలం 147 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్లో ఢిల్లీ జట్టు చేతిలో అత్యంత స్కోర్ చేసిన గుజరాత్.. ఈ మ్యాచ్ లోనూ అదే తరహా ఆట తీరు ప్రదర్శించింది.
కీలకమైన మ్యాచ్లో గుజరాత్ జట్టు కెప్టెన్ గిల్ చేతులెత్తేశాడు. బెంగళూరు బౌలర్ల ధాటికి తట్టుకోలేక.. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గిల్ నిలబడతాడని, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని గుజరాత్ జట్టు అభిమానులు ఆశించారు. కానీ వారి అంచనాలను గిల్ తలకిందులు చేశాడు. గిల్ రెండు పరుగులకే అవుట్ కావడంతో.. వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ” గుజరాత్ జట్టు పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉంది. అలాంటప్పుడు గిల్ లాంటి ఆటగాడు జట్టు భారాన్ని మోయాలి. కానీ అది తన బాధ్యత కాదన్నట్టుగా వెళ్లిపోయాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలాంటి విధానం కెప్టెన్సీకి గౌరవాన్ని తీసుకురాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు గిల్ అలాంటి షాట్లు ఆడకుండా ఉండాల్సిందని” సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు..
గిల్ మాదిరే ఓపెనర్ వృద్ధిమాన్ సాహ, కీలక ఆటగాడు సాయి సుదర్శన్ పెద్దగా పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యారు. ఈ క్రమంలో గుజరాత్ జట్టు భారాన్ని షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తేవాటియ (35) మోశారు.. ఫలితంగా గుజరాత్ జట్టు కనీసం ఆ స్కోరయినా చేయగలిగింది. లేకుంటే వందలోపే ఆల్ అవుట్ అయ్యేది. ఇక బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్, వైశాఖ్ కుమార్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. గిల్ అవుట్ అయిన విధానం పట్ల సునీల్ గవాస్కర్ మాత్రమే కాదు, సీనియర్ ఆటగాళ్లు సైతం మండిపడుతున్నారు. గొప్ప స్కోరు సాధించే ఆటగాడు, ఇలా అవుట్ అవ్వడాన్ని తప్పుపడుతున్నారు. బ్యాటింగ్ శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు.