https://oktelugu.com/

Antarctica : చర్మం కందిపోతోంది.. దృష్టిలోపం ఏర్పడుతోంది.. అంటార్కిటికా వన్యప్రాణులకు ఏంటి ఈ గోస?

అవి సముద్రపు లోతుకు వెళ్లడం వల్ల.. పై జంతువుల ఆహార చక్రం క్రమంగా గతి తప్పుతోంది.. అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే.. ఓజోన్ పొర క్రమంగా బాగుపడాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలా అది బాగుపడాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడమే ఇందుకు మార్గమని వారు చెబుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2024 / 10:31 PM IST

    Antarctica Continent

    Follow us on

    Antarctica : వాతావరణంలో ఉన్న గ్రీన్ హౌస్ వాయువుల నుంచి భూమిని రక్షించేందుకు ఓజోన్ పొర ఉందన్న విషయం మనకు తెలిసిందే. వాతావరణంలో ఏర్పడిన కాలుష్యం వల్ల ఆ పొరకు రంధ్రం ఏర్పడిందని ఎప్పటినుంచో మనం చదువుకుంటూనే ఉన్నాం. వాతావరణంలో మార్పుల వల్ల, ఆస్ట్రేలియా ప్రాంతంలో అడవులు కాలిపోవడం వల్ల.. ఏర్పడిన విషవాయువు వల్ల ఓజోన్ పొరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. క్లోరో ఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. 1987లో ప్రపంచ దేశాలు ఓజోన్ పొరను నాశనం చేసే కెమికల్స్ ను మనుగడలో లేకుండా చేయాలని తీర్మానం చేశాయి. ఈ ఒప్పందానికి “మాంట్రియల్ ప్రోటోకాల్ ” అని పేరు పెట్టాయి.. అయితే కొన్ని దేశాలు ఈ తీర్మానాన్ని విస్మరించడంతో ప్రమాదకర రసాయనాల వాడకం కనిపిస్తూనే ఉంది..

    అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం వల్ల అంటార్కిటికా మంచు ఖండం తీవ్రంగా ప్రభావితమవుతోంది. వాస్తవానికి అక్కడ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆ ప్రాంతంలో ఏర్పడే మేఘాలలో అధిక రసాయన పెద్ద చర్యలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల ఓజోన్ పొర అంతకంతకు దెబ్బతింటున్నది. ఇప్పటికే ఒక లేయర్ మొత్తం నాశనమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటార్కిటికా ప్రాంతంలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు శీతల వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో ఓజోన్ పొరకు ఉన్న రంధ్రం పెద్దదిగా మారుతుంటుంది. ఆ సమయంలో జంతువులు, మొక్కలు మంచు పొరల కింద ఉంటాయి. కానీ క్రమేణా కాలం మారిన తర్వాత జంతువులు, మొక్కలపై పరుచుకున్న మంచు పొరలు కరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆ రంధ్రం గుండా సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు జంతువులు, మొక్కల మీద పడుతున్నాయి. సూర్యుడి నుంచి ప్రసారమయ్యే ఆల్ట్రా వైలెట్ కిరణాల వల్ల రేడియేషన్ ప్రమాదం సంభవిస్తోంది. అందులో ముఖ్యంగా యూవీబీ కిరణాల వల్ల చర్మం కందిపోవడం.. క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే ఈ కిరణాల వల్ల ఆ ఖండంలో ఉండే క్షీరదాలు, ఇతర జంతువులపై కూడా అలాంటి ప్రభావమే పడుతోందా? అనే విషయంపై పరిశోధకులు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సీల్స్, పెంగ్విన్ల వంటి జంతువులకు ప్రత్యేక వెంట్రుకలు ఉంటాయి. అవి అతి నీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. అయితే దీర్ఘకాలంలో మాత్రం ఆ జంతువులు చూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

    సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తట్టుకునేందుకు నాచు మొక్కలు వాటి చుట్టూ సన్ స్క్రీన్ కాంపౌండ్స్ ను అభివృద్ధి చేసుకున్నాయి. సూర్యుడి బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు క్రిల్ అనే జీవి సముద్రంలోని అత్యంత లోతుకు వెళ్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి అంటార్కిటికా ప్రాంతంలో ఉండే తిమింగలాలు, పెంగ్విన్లు వంటి జంతువులకు క్రిల్స్ జీవులే ఆధారం. అవి సముద్రపు లోతుకు వెళ్లడం వల్ల.. పై జంతువుల ఆహార చక్రం క్రమంగా గతి తప్పుతోంది.. అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే.. ఓజోన్ పొర క్రమంగా బాగుపడాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలా అది బాగుపడాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడమే ఇందుకు మార్గమని వారు చెబుతున్నారు.