GT Vs PBKS: ఇదీ అసలైన టి20 అంటే.. ఇదీ అసలైన మజా అంటే.. సీట్ ఎడ్జ్ చివర్లో కూర్చుని.. ప్రేక్షకులు మొత్తం ముని వేళ్ళ మీద నిలబడి మ్యాచ్ చూసారు. ఇందులో ఎవరు గెలిచినా చరిత్రే. నిమిష నిమిషానికి సమీకరణాలు మారాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య గుజరాత్ జట్టుతో గురువారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. పంజాబ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 199 రన్స్ నమోదు చేసింది. గుజరాత్ జట్టు తరఫున గిల్, వృద్ధిమాన్ సాహా ఓపెనర్లుగా మైదానంలోకి దిగారు. గుజరాత్ జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు సాహా (13 బంతుల్లో 11 పరుగులు; రెండు ఫోర్లు) రబాడా బౌలింగ్లో శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. సాహా అవుట్ కావడంతో వన్ డౌన్ బ్యాటర్ గా కెన్ విలియంసన్ మైదానంలోకి వచ్చాడు. అతడు, కెప్టెన్ గిల్ (48 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు; 89*) కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ను పునర్నిర్మించే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 40 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 69 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు విలియంసన్ హర్ ప్రీత్ బ్రార్ బౌలింగ్ లో జానీ బెయిర్ స్టో కు క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం సాయి సుదర్శన్ క్రీజ్ లోకి వచ్చాడు. వచ్చి రాగానే పంజాబ్ బౌలర్ల పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 19 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్, గిల్ కలిసి మూడో వికెట్ కు 53 పరుగులు జోడించారు.. సాయి సుదర్శన్ 33 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. చివర్లో వచ్చిన రాహుల్ తేవాటియ మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్ సహాయంతో 23 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గుజరాత్ కెప్టెన్ గిల్ గురించి.. జట్టులో ఆటగాళ్లు కీలక సమయంలో అవుట్ అయితున్నప్పటికీ.. అతడు ఏమాత్రం తన లయను కోల్పోలేదు. ఓపెనర్ గా వచ్చిన అతడు.. మ్యాచ్ చివరి వరకు కొనసాగాడు.. చెత్త బంతులను బౌండరీ, సిక్స్ లు గా మలచిన అతడు.. పదునైన బంతులను డిఫెన్స్ ఆడాడు.. ఒక రకంగా గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకలాగా నిలిచాడు. సాయి సుదర్శన్, విలియంసన్, రాహుల్ తేవాటియా వంటి వారితో మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. గిల్ గనుక స్థిరంగా నిలబడకపోయి ఉంటే గుజరాత్ జట్టు ఆ స్థాయిలో స్కోర్ చేసి ఉండేది కాదు.
ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా రబాడా రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. హర్షల్ పటేల్, సికిందర్ రాజా, హర్ ప్రీత్ బ్రార్, సామ్ కరణ్ వంటి వారు తమ స్థాయిలో బౌలింగ్ వేయలేక పోయారు. దీంతో వీరి బౌలింగ్ ను గుజరాత్ ఆటగాళ్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్, గిల్, రాహుల్ తేవాటియ, విలియమ్సన్ వంటి వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా గుజరాత్ జట్టు 199 పరుగులు చేయగలిగింది.
200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక పరుగు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో నూర్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రభ సిమ్రాన్ సింగ్ 35 పరుగులు చేసినప్పటికీ.. కీలక సమయంలో అవుట్ కావడంతో పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామ్ కరణ్ కూడా ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు బరువును శశాంక్ సింగ్ (29 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో; 61*) మోశాడు. అతడు వికెట్ కీపర్ జితేష్ శర్మ (16), అషుతోష్ శర్మ (31) తో కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ జట్టును గెలిపించాడు. కీలక ఆటగాళ్లు అవుట్ అయినప్పటికీ శశాంక్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. సికిందర్ రాజా తో 41, జితేష్ శర్మతో 39, ఆశుతోష్ శర్మతో 43, హర్ ప్రీత్ బ్రార్ తో ఏడు పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి పంజాబ్ జట్టును విజయతీరాలకు మళ్ళించాడు. శశాంక్ సింగ్ వీరొచిత బ్యాటింగ్ పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ మ్యాచ్ ద్వారా సాధించిన విజయంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి ఎగబాకింది.. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన పంజాబ్ జట్టు.. రెండు విజయాలు సాధించగా, రెండు పరాజయాలు మూట కట్టుకుంది.
Shashank Singh wins it for @punjabkingsipl
His inspirefeul innings takes them over the line
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema #TATAIPL | #GTvPBKS pic.twitter.com/A9QHyeWhnG
— IndianPremierLeague (@IPL) April 4, 2024