Glenn Maxwell : గ్లెన్ మాక్స్ వెల్.. ఐపీఎల్ లో సంచలన ఆటగాడు. ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఈ ఆటగాడు టి20 లలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడి.. విజయాలు కూడా అందించాడు. అందువల్లే అతడికి ఐపీఎల్ లో విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో గత సీజన్లో బెంగళూరు జట్టు యాజమాన్యం మాక్స్ వెల్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఇటీవలి మెగా వేలంలో బెంగళూరు యాజమాన్యం అతడిని వదులుకుంది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. జట్టు మారినప్పటికీ మాక్స్ వెల్ ఆట తీరు ఏమాత్రం మారలేదు.. పైగా అతడు అత్యంత నాసిరకంగా బ్యాటింగ్ చేయడంతో.. ఆ ప్రభావం పంజాబ్ జట్టు స్కోర్ మీద పడుతోంది. అయినప్పటికీ పంజాబ్ జట్టు యాజమాన్యం అతడికి వరుసగా అవకాశాలు ఇస్తోంది.
Also Read : చేతిలో మందు గ్లాస్.. తన్నుకొస్తున్న బొర్ర.. ఓ భయ్యా నువ్వు ఐపీఎల్ ఆడేటట్టు లేవుగా?
గాయం అయిందట
మాక్స్ వెల్ ఏ మాత్రం అంచనాలకు అందే విధంగా ఆడ లేకపోవడంతో.. పంజాబ్ జట్టు అతనిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో మాక్స్ వెల్ పై కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి నెలకొంది. ఇదే తరుణంలో మాక్స్ వెల్ గాయపడ్డాడు. అతడు వేలు ఫ్రాక్చర్ కావడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ” చెన్నై జట్టుతో ఆడుతుండగా మాక్స్ వెల్ వేలికి గాయమైంది. వైద్యుల పరిశీలనలో అది ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది. అందువల్లే అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయాల్సి వచ్చిందని” పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మాక్స్ వెల్ ను సిరీస్ మొత్తానికి దూరం పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుత ఐపిఎల్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన మాక్స్ వెల్ 48 రన్స్ మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్ లలో ఒక సిక్స్, ఐదు ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఇక బౌలింగ్లో 13 ఓవర్లు పాటు బౌలింగ్ వేసి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. జట్టుకు భారంగా ఉన్న అతడిని వేలికి గాయమైందని సాకుగా చూపించి.. రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారనే వాదనలు లేకపోలేదు. ” అతడు సరిగ్గా ఆడటం లేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదు. జట్టు యాజమాన్యం మాత్రం ఏం చేస్తుంది. అవకాశాలు ఇచ్చుకుంటూ పోయింది. ఇక చాలు అనుకొని భావించింది. అందువల్లే ఇక పక్కన పెట్టింది. కాకపోతే అంతటి ఆటగాడిని పక్కన పెడితే బాగోదు కాబట్టి.. గాయం అనే విషయాన్ని మాత్రం సాకుగా చూపించింది. అందువల్లే అతడు ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడని” విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.